Read more!

గురక పెట్టడానికి కారణాలు ఇవే!

మనిషికి అయిదుగంటల నిద్ర పెర్ఫెక్ట్! ఆరుగంటల నిద్ర ఆరోగ్యానికి చాలామంచిది. ఏడుగంటల నిద్ర కొంతమందిలో సమంజసమే! ఎనిమిది గంటల నిద్ర ఫరవాలేదు. పది గంటల నిద్ర మనిషిలో బద్దకాన్ని... నిస్సత్తువనూ... నిరాసక్తతనూ సూచిస్తుంది. పన్నెండు గంటల నిద్ర మనిషిలో తెలియని వ్యాధికి సంకేతం. అంతకుమించిన నిద్ర ఖచ్చితంగా అనారోగ్యమే! 

మానసికంగా శారీరకంగా అలసిపోయిన మనిషి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటాడు. అలాంటప్పుడు మరోగంటో గంటన్నరో ఎక్కువ నిద్రపోవడం కూడా జరుగుతుంది. ఇది అతని శరీర అలసటను తెలియజేస్తుంది. ఇటువంటప్పుడు ఎంతసేపు లేపినా నిద్రలేవరు. శారీరకంగా ఉండే అలవాటు బాగా తగ్గిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే నిద్రలేచి తమ రోజువారీ కార్యక్రమాలను చూసుకుంటుంటారు. వీరు ఈవిధంగా రోజూ నిద్రపోరు. ఎప్పుడో.. ఏవారం పదిరోజులకో ఓసారి ఇలా నిద్రపోతుంటారు. ఇలా రోజూ నిద్రపోతుంటే మాత్రం అది క్రమేపీ బద్దకంగా మారిపోతుంది.

ఆఫీసులో గుమాస్తాలుగానూ, ఆఫీసర్లగానూ, ఎగ్జిక్యూటివ్ గానూ పనిచేసి వారు మానసికంగా అలసిపోతుంటారు. ఇటువంటివారు అయిదారు గంటలపాటు నిద్రపోయేసరికి మైండ్ ఫ్రెషయ్యి ఉత్సాహంగా తయారైపోతారు. కాయకష్టం చేసేవారు అంటే  ముఠా కార్మికులు, రిక్షా కార్మికులు, చిల్లరవర్తకులు, వ్యవసాయ కార్మికులు వంటివారు శారీరకంగా అలసిపోతారు. ఇటువంటి వారు అదనంగా మరో అరగంటో గంటో నిద్ర పోతారు. ఇది సహజమే! బాగా అలసిపోయి. ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవారు నిద్దట్లో తమకు తెలియకుండానే గురక పెడుతుంటారు. అయితే అలసటకు గురైనా గురికాకున్నా నిద్రపోయిన వెంటనే గురక గురక పెడుతుండటం సర్వసాధారణమే...! ఇది వారి అలసటను తెలియజేస్తుంది...!

ఈ విధంగా గురక పెట్టడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. మనం ముక్కుద్వారా, నోటిద్వారా గాలి పీలుస్తూంటాం. ఈవిధంగా గాలి పీల్చడానికీ, వదలడానికీ ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు మరింత బలంగా గాలిపీల్చి వదులుతుంటారు. ఈ క్రమంలో కొండనాలిక కింద భాగానికి ప్రెస్ అవ్వడం ద్వారా శబ్దతరంగాలు వెలువడుతుంటాయి. గురకపెట్టేవారు మామూలు మనిషికన్నా ఏడురెట్లు అధికంగా గాలిపీలుస్తారని వివిధ పరిశోధనల్లో తేలింది.

గురక రావడానికి కారణాలు!

గొంతు మరియు శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యేవారు ఎక్కువగా గురకపెడుతుంటారు.

మనగొంతులోని "యువులా" అనేభాగం ఈ శబ్దతరంగాలను సృష్టిస్తుంది.

ముక్కుకు సంబంధించిన క్రానిక్ కోల్ట్, సైనసైటిస్, డీవియేటెడ్ సెప్టెమ్ వంటి వ్యాధులకు గురైనవారు ముక్కుద్వారా గాలిపీల్చడం కష్టమై నోటిద్వారా గాలి పీల్చడం జరుగుతుంది. ఎక్కువ భాగం గురకలు నోటిద్వారా గాలిపీల్చడం వల్లే సంభవిస్తుంటాయి. 

నోటిద్వారా గాలిపీల్చడం వల్ల 'గురక' ప్రారంభమౌతుంటుంది. గురకలు ముక్కు ద్వారానూ, గొంతుద్వారానూ కూడా వస్తుంటాయి. అయితే ముక్కుద్వారా వచ్చేగురక చిన్నశబ్దం చేస్తే గొంతుద్వారా చేసే గురక పెద్దశబ్దంతో వస్తుంది.

 ముక్కు దిబ్బడ వేయడం, పొక్కులు ఉండటం, అతిగా జలుబు చేసి ముక్కువెంటనీరు కారుతుండటం, ముక్కు అట్టకట్టిపోవడం, లేదా ముక్కు దూలం వంకరకావడం వంటి కారణాలతో మనిషి నోటిద్వారా గాలి పీల్చడానికి ప్రయత్నిస్తాడు. నోటిద్వారా గాలి పీల్చడం  వల్ల సాధారణంగా ముక్కుద్వారా పీల్చే గాలికంటే ఎక్కువగాలిని పీల్చవల్సివస్తుంది. కావాల్సిన గాలికంటే ఎక్కువగాలి పీల్చి వదులుతున్నప్పుడు ఆ గాలి వేగానికి కొండనాలుక అడ్డుబడి గురకవస్తుందని చెబుతారు. 

గురక పెట్టే  వ్యక్తికి తాను గురకపెడుతున్నట్లు తెలియదు. అయితే గురక పెట్టేవ్యక్తి చేసే శబ్దాలు వినేవారికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి!

                                      ◆నిశ్శబ్ద.