Read more!

స్వీయ క్రమశిక్షణ ఎందుకు అవసరం?

ప్రతి మనిషి జీవితం ఓ సరళ రేఖ లాగా అలా సాగిపోవాలి అంటే ఎన్నో విషయాలు సక్రమంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఉద్యమ లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి విషయం ఎగుడుదిగుడు దారిలాగా సాగుతూ ఉంటుంది చాలా మందికి. ఇలాంటి సమస్య లేకుండా హాయిగా సాగిపోవాలంటే ప్రతి వ్యక్తి నైతికంగా దృఢంగా ఉండాలి. నైతిక విలువలు, నైతికత అనేవి మనిషిని ప్రతి పనిలో సమర్థవంతుడిగా నిలబడతాయి. 

నిజజీవితంలో నైతిక ప్రవర్తన ప్రభావవంతంగా ఉండాలంటే స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ప్రతి వ్యక్తి తనకు తాను కొన్ని ఉద్దేశ్యాలు, కొన్ని పరిధులు, కొన్ని అలవాట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల తన పరిధిలో తాను ఉండటం కుదురుతుంది. ఇలా ఆత్మవిశ్వాసంతో తమపై తాము విధించుకొని అమలుపరచేదే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో విజయం సాధించాలంటే మనంతట మనం నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవనాన్ని గడపాలి. 

చాలామంది జీవితంలో ఓటమి పాలవ్వడానికి ముఖ్యమైన కారణం స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే. ఇది చాలామందికి అర్థం కాదు. తాము బానే కష్టపడుతున్నాం, బానే చదజేవుతున్నాం అనుకుంటారు. కానీ జరుగుతున్న తప్పేమిటంటే స్వీయ క్రమశిక్షణ లేకపోవడం. ఎవరో చెబితే తప్ప తాను చేయాల్సిన పనులు చేయలేకపోవడం. ఈ తరహా తీరు మనిషిని తప్పకుండా బద్ధకిష్టుల జాబితాలోకి సులువుగా చేరిపోయేందుకు సహకరిస్తుంది. చాలామంది నియమబద్ధమైన జీవనశైలి లేని కారణంగా విజయాన్ని సాధించలేకపోతారు.

స్వీయ మూడు రకాలుగా ఉంటుంది.

భౌతిక క్రమశిక్షణ,

మానసిక క్రమశిక్షణ, 

ఆధ్యాత్మిక క్రమశిక్షణ

అనే మూడు విధాలుగా ఉంటుంది. 

భౌతిక క్రమశిక్షణ:-  నిర్దిష్టమైన దైనందిన కార్యకలాపాలు, నియమిత ఆహారం, విశ్రాంతి, వినోదాలు, నిద్ర, నిర్దిష్టమైనపని, అన్నిచోట్ల క్రమశిక్షణతో మెలగడం వంటివి భౌతిక విధానానికి చెందిన స్వీయ క్రమశిక్షణలోకి వస్తాయి.

మానసిక క్రమశిక్షణ:- అనవసరమైన వాటిపైకి దృష్టిని మరల్చి, మానసిక శక్తిని వృథాచేసే అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండటమే మానసిక క్రమశిక్షణ. అతిగా దిగులు చెందడం, కృంగుపాటుకు గురవ్వడం, నిరాశ చెందడం, పగటి కలలు కంటూ ఉండటం వలన కూడా మానసిక శక్తి వృథా అవుతూ ఉంటుంది. ఏ విధమైన చంచలత్వానికి లోను కాకుండా నిర్దేశిత లక్ష్యంపై మనస్సును లగ్నం చేయాలి. అలాగే క్రమబద్ధమైన, తర్కబద్ధమైన ఆలోచనా విధానాలపై మనస్సుకి శిక్షణనివ్వాలి. 

ఆధ్యాత్మిక క్రమశిక్షణ:- మనస్సుని ఏకాగ్రం చేయడంపై ఇచ్చే శిక్షణ కూడా మానసిక శిక్షణలోనిదే. "నేను యథార్థ సత్యాలను అభ్యసించను. నేను ఏకాగ్రతా శక్తిని, విషయ పరిత్యాగ శక్తిని సాధన చేస్తాను. అలా పరిణతి చెందిన మనస్సుతో విషయ గ్రహణానికి పూనుకొంటాను" అని స్వామి వివేకానంద వక్కాణించారు.

స్వీయ క్రమశిక్షణను అలవరచుకొన్నవారికి అంతర్గత స్వేచ్ఛ, శక్తులు లభిస్తాయి. ఎంచుకొన్న ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించడంలో ఇవి తోడ్పడతాయి. నియమబద్ధమైన జీవనం లేనివారు అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేసేవారు, సోమరిపోతు విద్యార్థులు తమ అలవాట్లకు తామే బలి అవుతూ, తమకేకాక ఇతరులకు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంటారు.

అందుకే మనిషి జీవితానికి స్వీయ క్రమశిక్షణ అనేది జీవితాన్ని మర్చివేసే మార్గం అవుతుంది.

                                      ◆నిశ్శబ్ద.