పాయె.. సీఐడీ పరువు గంగలో కలిసి పాయె
posted on Nov 4, 2022 7:28AM
ఏపీ సీఐడి పరువు గంగలో కలిసింది. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ కు రిమాండ్ విధించేందుకు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ తిరస్కరించడంతోనే ఏపీలో సీఐడీ ఏలిన వారి అడుగులకు మడుగులొత్తుతూ..వారి కనుసన్నలలో పని చేస్తోందన్న విషయం మరో సారి స్పష్టమైంది. అయ్యన్న అరెస్ట్ కేసులో 467 సెక్షన్ వర్తించదని విస్పష్టంగా తేల్చేసి బెయిలు మంజూరు చేసింది. అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించింది.
నాలుగు వందల మంది వందల మంది పోలీసులతో తెల్లవారు జామును అయ్యన్నపాత్రుడి ఇంటిపై దాడి చేసి గోడదూకి తలుపులు పగలగొట్టి ఈడ్చుకెళ్లి మరీ అరెస్టు చేసిన సీఐడీ పోలీసులకు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చెంపపెట్టులా తగిలాయని చెప్పక తప్పదు. కాగా అయ్యన్న పాత్రుడు ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. సీఐడీని కేసు డెయిరీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో .. రిమాండ్‌కు తరలించేంత ఆధారాలు లేవని గుర్తించిన న్యాయమూర్తి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని చెప్పి.. రిమాండ్‌ను తిరస్కరించింది.
ఇక అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడిని అరెస్టు చేయడానికి కారణం ఏమిటో, కేసు ఏమిటో, నేరం ఏమిటో చెప్పలేక నానా ఇబ్బందులూ పడ్డారు సీఐడీ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి, అయ్యన్న అరెస్టు గురించి మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ విలేకరుల సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. . ఏఈ సంతకం ఫోర్జరీ చేశారని..ప్రాథమిక విచారణ చేశామని చెప్పినా... అయ్యన్నకు నోటీసులు ఇచ్చారా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టారు.
అరెస్టుకు సహకరంచలేదని ఇంట్లోకి చొరబడ్డామని చెప్పుకొచ్చారు. నేరానికి పాల్పడిన వారు సహకరించకపోతే ఎలాగైనా అరెస్టు చేయవచ్చని చట్టంలో ఉందని మీడియాలో గంభీరంగా చెప్పారు కానీ.. మేజిస్ట్రేట్ రిమాండ్ నిరాకరించడంతో అయ్యన్న అరెస్టు రాజకీయ కక్ష సాధింపు కోసమేనని తేలిపోయింది.
అయినా ఏలిన వారి ప్రాపకం కోసం ఇలా అరెస్టులు చేయడం, కోర్టులు అలా రిమాండ్ విధించడానికి తిరస్కరించడం సీఐడీ కేసుల్లో ఒక ఆనవాయితీగా మారిపోయింది. సీఐడీ అరెస్టు చేసిందంటే అది కచ్చితంగా అక్రమ కేసేనని జనం అనుకునే పరిస్థితి వచ్చేసింది. సీఐడీ ఏలిన వారి సొంత సైన్యంలా పని చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.