వేలంలో రూ.66 వేలు పలికిన కొబ్బరి కాయ
posted on Nov 4, 2022 @ 9:52AM
హైదరాబాద్ లో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రసిద్ధి. గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించిన తరువాత ఆ తొమ్మిది రోజులూ గణేషుడి చేతిలో ఉన్న లడ్డూను వేలం వేస్తారు. వేలంలో లడ్డును దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలూ, ఆరోగ్యం సిద్ధిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే బాలాపూర్ గణేషుడి లడ్డూ ఏ యేటికా యేడు రికార్డులు బద్దలు కొడుతూ ఉంటుంది. లక్షలు పోసైనా సరే వేలంలో లడ్డూను దక్కించుకోవాలని పోటీలు పడుతుంటారు.
అలాగే తమిళనాడులోని తేని జిల్లా బోడి ప్రాంతంలో కొబ్బరి కాయ వేలం అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ ప్రాంతంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్కంద షష్టి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా వల్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యేస్వర స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పూజలో ఉంచిన వస్తువులను వేలం వేశారు.
పూజలో ఉంచిన కొబ్బరి కాయను వేలంలో ఓ భక్తుడు రూ.66 వేలకు దక్కించుకున్నారు. గత ఏడాది వేలంలో కొబ్బరి కాయ ధర 27 వేలు పలికింది. సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణంలో ఉంచిన కొబ్బరి కాయను ఇంటికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తే శుభం జరుగుతుందనీ, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. మొత్తం మీద కొబ్బరికాయ వేలంలో రూ.66 వేలు పలకడం రికార్డు సృష్టించింది.