ఏపీ బీజేపీలో అయోమయం.. గందరగోళం
posted on Nov 4, 2022 7:08AM
ఏపీ బీజేపీ నాయకుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైంది. పై నుంచి ఆదేశాలు అంటూ రాష్ట్రంలో అధికార వైసీపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇరు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయన్న బిల్డప్ ఇవ్వడానికి వారి శక్తిని మించి ప్రయత్నిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం కావాలన్న మోడీ సర్కార్ ఆఘమేఘాల మీద చేసేస్తోంది.
పరిమితికి మించిన అప్పులు, రాష్ట్రం దివాళా అంటూ రాష్ట్రంలో బీజేపీ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంటే.. కేంద్రం మాత్రం ఏపీ సర్కార్ కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరిమితితో సంబంధం లేకుండా అప్పులు చేసుకోవడానికి వాయువేగంతో అనుమతులు ఇచ్చేస్తోంది. సరే అది పక్కన పెడితే..ప్రధానమంత్రి విశాఖ పర్యటన ఏర్పాట్లను విజయసాయిరెడ్డి సమీక్షించడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అసలేం జరుగుతోందో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు విజయసాయి ఎవరంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రుసరుసలాడారు.
పులివెందుల పర్యటనలో ఉన్న సోము వీర్రాజు మీడియా సమావేశంలో విజయసాయిపై నిప్పులు చెరిగారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల సమీక్షకు ఆయనకున్న అధికారాన్ని ప్రశ్నించారు. ప్రధాని పర్యటనను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలలో అయోమయాన్ని సృష్టించేందుకే విజయ సాయిరెడ్డి ఈ పర్యవేక్షణ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. భారత ప్రధాని అధికారిక పర్యటన ఎపి ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాలని, కలెక్టర్ లు పర్యటన వివరాలు చెప్పాలని అయితే అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి చెప్పడాన్ని సోము తప్పుపట్టారు.
ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదంతా ఎందుకంటే ప్రధాని పర్యటన వివరాలపై తమకు ఓ వైపు తమకు సమాచారం లేదనే బాధ.. మరోవైపు ప్రధాని పర్యటనకు వైసీపీ సర్కార్ చేస్తున్న హడావుడి బీజేపీ రాష్ట్ర నాయకులకు అసలేం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితిలోకి నెట్టేసింది. దీంతో విమర్శలకు దిగుతున్నారు.