స్వచ్ఛ భారత్ కు పదేళ్లు
posted on Oct 2, 2024 @ 1:24PM
స్వచ్ఛ భారత్ అభియాన్.. దేశంలో ఈ కార్యక్రమం ప్రారంభమై నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యింది. పూజ్య బాపూజీ కలలు గన్న పరిశుభ్ర భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని పిలుపు నిచ్చారు. మోడీ తొలి సారి ప్రధాని పదవి చేపట్టినది 2014లో. అదే ఏడాది అక్టోబర్ 2న మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. అప్పటి నుంచీ ప్రతి ఏటా అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అందరూ స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలో పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టి పరిశరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ఆరంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పరిశుభ్రత, స్వచ్ఛత కు సంబంధించి 96వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రజల చొరవే స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రజలంతా స్వచ్ఛ భారత్ లో పాల్గొని తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇలా ఉండగా దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో ప్రజలు, ప్రజా ప్రతినిథులు పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మచిలీపట్నంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కిందట స్వచ్ఛ భారత్ నినాదంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు. ఐదేళ్లలో అంటే 2029 నాటికి ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మారుస్తానమి చెప్పారు. రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.