లడ్డూ కల్తీ.. సుప్రీం తీర్పుపైనే అందరి దృష్టీ!
posted on Oct 2, 2024 @ 11:36AM
లడ్డూ వివాదం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కొత్త రూపు సంతరించుకుంది. సీఎం ప్రకటనతో ప్రారంభమై అన్ని రాజకీయపార్టీ నాయకుల వ్యాఖ్యలు,ఆందోళనలతో రాజకీయ రంగుపులుముకుని వేడి పుట్టింది. ఒక దశలో సీఎం, మాజీ సీఎంల మధ్య రాజకీయపోరాటమా అనిపించింది. ఆధారాలు లేకుండా రాజ్యాంగ పదవిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయడం శ్రీవారి కోట్లాది భక్తుల మనోభావాలకు భంగం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, లడ్డూలో కల్తీ జరిగిందనటానికి ఆధారాలు మీ దగ్గర ఏమి ఉన్నాయి అని ప్రశ్నించడంతో అందరి దృష్టీ గురువారం (అక్టోబర్ 3) ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు వెలువరించనున్న తీర్పుపైనే కేంద్రీకృతమైంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య స్వామి వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సుప్రీం తుది తీర్పు ఇవ్వకుండానే విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. కూటమి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే వైసీపీ ముందస్తు సంబరాలను న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. తొందరపాటు అని అభివర్ణిస్తున్నారు. విచారణ సందర్భంగా కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించిందనీ, గురువారం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనను వివరించాల్సి ఉందనీ అంటున్నారు.
కాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ హుందాగా వ్యవహరించిందని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీం కోర్టు సిట్ విచారణను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు. సీఎం ప్రకటనపైనే వ్యాఖ్యానించింది. అయినా తెలుగుదేశం ప్రభుత్వం సిట్ విచారణ నిలుపుదల చేయాలని నిర్ణయించింది.
వైసీపీ హయాంలో తిరుమలలో అనేక అవకతవకలు జరిగిన నేపధ్యంలో అక్కడి సిబ్బంది,భక్తుల నుంచి లడ్డూ నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులు, కనీసంరూ.800 ఉన్న ఆవునెయ్యి కిలో 320రూపాయలకు సరఫరా చేయడంతో కల్తీ జరిగిందనేది అనుమానాలు పొడసూపాయి. రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదాన్ని కోర్టు ఏలా పరిష్కరిస్తుందనేది వేచిచూడాలి.