అడ్డంగా దొరికిన సజ్జల.. క్రైస్తవ సంఘాలు ఆగ్రహం
posted on Oct 3, 2024 6:32AM
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిసిందని ల్యాబ్ రిపోర్టులు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ హయాంలో తక్కువ ధరకు నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూ తయారీకి వినియోగించారు. దీంతో తిరుమల దర్శనం చేసుకున్న చాలా మంది భక్తులు గతంలో లడ్డూ క్వాలిటీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గత ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లడ్డూ క్వాలిటీగా ఎందుకు లేదనే అంశంపై అధికారులు దృష్టిసారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. క్వాలిటీ తక్కువ నెయ్యి వాడుతున్నారని తేలడంతో పాటు.. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలుస్తున్నట్లు ల్యాబ్ రిపోర్టుల్లో తేలింది. దీంతో జగన్ మోహన్ రెడ్డిపై హిందువు సంఘాలు, హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ బ్యాచ్ మాత్రం తప్పును ఒప్పుకొని దేవుడిని క్షమాపణలు కోరకుండా.. ల్యాబ్ రిపోర్టులు అబద్దమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కేంద్రం అనుమతితో నిర్వహిస్తున్న ల్యాబ్ రిపోర్టులను చంద్రబాబు ఇంటిలో తయారు చేసిన రిపోర్టులు అంటూ జగన్, ఆయన బ్యాచ్ పదేపదే ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కాస్త కోర్టుకు చేరింది.
లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. మంగళవారం(అక్టోబర్1) దేశ అత్యన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణలో న్యాయస్థానం రాష్ట ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ఓ ప్రశ్న సంధించారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా, సిట్ రిపోర్ట్ రాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి లడ్డూ కల్తీ జరిగిందని ఎలా చెప్తారు..? అన్నదే ప్రశ్న. దీన్నే ఆయుధంగా మార్చుకున్న వైసీపీ డ్రామా షురూ చేసింది. అసలు కోర్టులో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే.. భక్తులకు, కోట్లాది హిందువులకు అబద్ధపు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వానికి సుప్రీం చివాట్లు పెట్టిందని, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మొట్టికాయలు వేసిందని వైసీపీ ముఖ్య నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు చెత్త డిమాండ్లు చేస్తున్నారు.
వాస్తవంగా.. సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. కేవలం లడ్డూ కల్తీ అయిందనే విషయంపై పూర్తి ఆధారాలు లేకుండానే ఎందుకు మాట్లాడారని ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియా ముందుకు రాని సజ్జల రామకృష్ణారెడ్డి.. తాజాగా కల్తీ లడ్డూ వివాదంపై మీడియాతో మాట్లాడారు. ఆ మీడియా సమావేశం లైవ్ అనుకుంటే పొరపాటే. రికార్డు చేసిన వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో సజ్జల అడ్డంగా దొరికిపోయారు.
మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంటే జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారు. తిరుపతి లడ్డూ విషయంపై మొన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలోనూ విలేకరులు కెమెరాలు పట్టుకొని రావొద్దు.. ప్రశ్నలు అడిగేందుకు రండి. మేమే మీకు రికార్డు చేసి వీడియోను పంపిస్తాం అంటూ వైసీపీ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. రెండురోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి తిరుమల లడ్డూ వివాదంపై విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాడు. వాళ్ల సొంత గదిలో సొంత వీడియో రికార్డులో పెట్టుకున్నారు. ఇక్కడే సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. సజ్జల మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనుకాల అల్మారాలో మూడు శిలువలు ఉన్నాయి. ఈ శిలువలు లైవ్ జరుగుతుండగానే గుట్టుచప్పుడు కాకుండా పక్కకు తీశారు. అంటే.. సజ్జల మీడియా సమావేశం ప్రారంభంలో ఆయన వెనుకాల అల్మారాలో శిలువ గుర్తులు ఉన్నాయి. కెమెరా సజ్జలను జూమ్ తీసుకొని.. మళ్లీ యథాస్థితికి వచ్చే సరికి వెనుకాల అల్మారాలో శిలువ గుర్తులు కనిపించకుండా పోయాయి. ఎందుకు సజ్జల అనుచరులు వాటిని తొలగించారంటే.. మాట్లాడేది తిరుమల లడ్డూ వ్యవహారం గురించి.. ఆయన వెనుకాల శిలువ గుర్తులు ఉంటే ఎవరైనా హిందువులు ఆయన మాటలను విశ్వసించరు.అన్న భయంతోనే. దీంతో మీడియా సమావేశం సగం పూర్తయిన తరువాత ఆయన అనుచరులు ఆ శిలువ గుర్తులను తొలగించారు. దీంతో పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సజ్జల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి సజ్జల మీడియా సమావేశం మధ్యలో ఆయన వెనుకాల ఉన్న శిలువ గుర్తులను తీయమని ఎవరూ అడగలేదు. కానీ, వాటిని తొలగించడం పట్ల క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసిన సజ్జల, వైసీపీ నేతలు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి కారకులు కాలేదని ఎలా అనుమానించకుండా ఉండగలమని హిందువులు, స్వామివారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం వైసీపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే తరుణంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోతున్నారు.