అవినీతిలో అగ్రస్థానం ఎవరిదో! తెలుగు రాష్ట్రాల మధ్య పోరు..
posted on Dec 23, 2021 @ 1:11PM
‘అవినీతి సర్వాంతరయామి. అదొక ప్రపంచ సమస్య’...ఇది మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 40-45 ఏళ్ల క్రితం ఎప్పుడో వెలిబుచ్చిన అభిప్రాయం. అలాగే,మరో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే నిజమైన లబ్దిదారులకు చేరుతోంది .. మిగిలిన 85 పైసలు మధ్య దళారీల జేబుల్లోకి పోతున్నాయని అన్నారు. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, అక్రమార్కులు విదేశాలకు తరలించుకుపోయిన అవినీతి సొమ్మును ఏడాదిలో వెనక్కి తీసుకోస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. నిజానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన అవినీతి కుంభకోణాలను నిచ్చెన మెట్లుగా చేసుకునే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అవినీతి రహిత పాలన అందిస్తామని మోడీ మాటిచ్చారు.
అయితే, గడచిన ఏడున్నర సంవత్సరాల మోడీ పాలనలో అవినీతి అదుపులోకి వచ్చిందా అంటే, లేదు. నిజానికి, ఇకొంత పెరిగింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) 180 దేశాలో నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం మన దేశం గతసంవత్సరం (2020) కంటే ఈ సంవత్సరం (2021)ఆరు మెట్లు దిగజారి, 86 వస్తానానికి చేరింది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన దేశంలో అవినీతి పెరిగిందే కానీ, తరగలేదు.
అదలా ఉంటే,తెలుగు రాష్ట్రాల్లో అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వే ప్రకారం దేశంలో అవినీతిలో అగ్రస్థానం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి మరీ లంచాలు వాసులు చేస్తున్నారని, లంచం ఇవ్వనిదే చావు సర్టిఫికేట్ కూడా రావడం లేదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన సర్వే నివేదికలో వెల్లడించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో 70 శాతంపైగానే అవినీతి నెలకొందని తేలింది. అధికారులలో 80 శాతం మంది అవినీతిపరులే ఉన్నారన్న ప్రజల అభిప్రాయాన్ని సర్వే రిపోర్టు పేర్కొంది. అత్యధికంగా రెవెన్యూ శాఖలో 85 శాతం అవినీతి ఉందని సర్వే స్పష్టం చేసింది. మూడో స్థానంలో పోలీస్ విభాగం అవినీతి 79 శాతం ఉందని తేల్చింది. అవినీతి నిర్మూలన కోసం పనిచేసే విజిలెన్స్ కమిషన్ , యాంటీ కరప్షన్ బ్యూరో వంటి వాటిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తన సర్వే వివరాలను వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో 80 శాతం మంది అవినీతిపరులేనని ప్రజల తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సర్వే పేర్కొంది.
కాగా ఈనివేదికను విడుదల చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లోనే ఈ అవినీతి ఎక్కువగా కనిపిస్తోందన్నారు.దేశంలో అవినీతిపరులకు ఏళ్ళు పూళ్ళు గడిచినా శిక్షలు పడక పోవడం వలన రాజకీయ అవునీతి రోజు రోజుకు పెరిగిపోతోందే అభిప్రాయం వ్యక్త పరిచారు. తక్షణమే శిక్ష పడితే ఇతరుల్లో భయం ఏర్పడుతుందని తద్వారా అవినీతి కొంత తగ్గుతుందని ఆయన అన్నారు, ప్రభుత్వ విభాగాల్లో సాంకేతికతను ఉపయోగిస్తే అవినీతిని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇన్ కంట్యాక్స్ విభాగాన్ని ఎలాగైతే అన్ లైన్ చేశారో అలాగే ప్రతి విభాగంలో టెక్నాలజీ ఉపయోగిస్తే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల ఆవినీతికి అడ్డుకట్ట వేయకుండా అవినీతిని ఆదుపు చేయడం అయ్యే పనికాదని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులకు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు, పోస్టింగులు, బదిలీలు తెచ్చుకునే అధికారుల నుంచి నిజాయతీని ఆశించడం కూడా అత్యాశే అంటున్నారు,విజ్ఞులు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు తీసుకోవడమే కాకుండా, యా డబ్బులకోసం ధర్నాలు చేయడం చూసిన తర్వాత, పెద్ద ఎత్తున అవినీతి ప్రయోజనాలు పొందుతోంది రాజకీయ న్యాకులు, అధికారులే అయినా, అవినీతిలో సామాన్య ప్రజలకు మినహాయింపు ఇవ్వలేమని అంటున్నారు.