వైసీపీ అంటే.. 'ఏమీ చేతగాని ప్రభుత్వం'.. వైఫల్యాలకు ఏపీ కేస్ స్టడీ..
posted on Dec 23, 2021 @ 12:09PM
ఏపీ ఖజానా ఖాళీ. దమ్మిడి రాబడి లేదు. ఒక్క అభివృద్ధి పథకమూ లేదు. కొత్తగా పెట్టుబడి కానీ, కంపెనీ కానీ వచ్చింది లేదు. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు. కేంద్రం నుంచి అదనపు అప్పులు ముట్టడం లేదు. ఇలా.. అన్నిట్లోనూ లేదు..లేదు..లేదు. అందుకే, వైసీపీ అంటే.. ఏమీ చేతగాని ప్రభుత్వం అంటోంది బీజేపీ. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ‘వైసీపీ అంటే.. ఏమీ చేతగాని ప్రభుత్వం’ అనేలా తయారైందని ఎద్దేశా చేశారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
"కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం నిధులివ్వకపోవడంతో కేంద్ర నిధులూ రావడం లేదు. ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ నిధులు ఇచ్చింది ఏపీకే. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారు." అని జీవీఎల్ మండిపడ్డారు.
"వైసీపీ చేతకానితనంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగింది. ఓటీఎస్ పేరుతో కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థిక వైఫల్యానికి కేస్ స్టడీలా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉంది" అని జీవీఎల్ ఆరోపించారు.