కేసీఆర్? హూ ఈజ్ కేసీఆర్?
posted on Jun 24, 2024 @ 3:47PM
ఒక టీవీ డాన్స్ ప్రోగ్రామ్‌లో ఓ డాన్సర్... ‘‘దుర్గారావ్? హు ఈజ్ దుర్గారావ్?’’ అన్నట్టుగా.. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ‘‘కేసీఆర్? హు ఈజ్ కేసీఆర్?’’ అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారణం యువతరం ఆత్మహత్యలు చేసుకోవడం అయినప్పటికీ, కేసీఆర్ ఆ ఘనతను తన అకౌంట్లో వేసుకోవడానికి ప్రతిసారీ ప్రయత్నిస్తూ వుంటారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని ఆయన చెప్పుకుంటూ వుంటారు. అయితే ఆయన చేసింది నిరాహారదీక్షే కాదని, ఫ్లూయిడ్స్ దీక్ష అని అందరికీ తెలిసిన విషయమే.. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని తెలంగాణ బిడ్డలే చెబుతూ వుంటారు. మరి అబద్ధాలు చెప్పారో, మభ్యపెట్టారో.. మొత్తానికి అధికారంలోకి వచ్చారు. పది సంవత్సరాలపాటు తెలంగాణని కేసీఆర్ మహారాజులాగా ఏలారు. తెలంగాణకు ఏం చేశారో ఏమోగానీ, ఆయన కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్ నాయకులు మాత్రం బాగా అభివృద్ధి చెందారు.
పది సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన ప్రజలు విసిగిపోయారు. ఈసారి ఆయన పార్టీని దారుణంగా ఓడించారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన కేసీఆర్ గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఇప్పటి వరకూ అనుసరించిన మహారాజుల ధోరణినే అనుసరిస్తున్నారు. ప్రస్తుతం వున్న వాతావరణాన్ని గమనిస్తే, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గానీ, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం గానీ కనిపించడం లేదు. ఎందుకంటే, బీజేపీ రాష్ట్రంలో రెండో స్థానంలోకి వచ్చేసింది. నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ తెచ్చింది మేమే అని డబ్బా కొట్టుకునే బీఆర్ఎస్ మాత్రం సున్నా ఫలితాలు సాధించింది. కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ గానీ తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయతని కోల్పోయారు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం.
ఒక్క మాటలో చెప్పాలంటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు మానసికంగా దూరం అయిపోయింది. ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్ జారిపడి తుంటి విరగ్గొట్టుకున్నారు. ఆ ఘటనని తెలంగాణ ప్రజలు లైట్‌గా తీసుకున్నారు. కేసీఆర్ తుంటి నిజంగానే విరిగిందో లేదోగానీ, ఇదంతా ఒక డ్రామా అని తెలంగాణ ప్రజలు భావించారు. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు కేసీఆర్‌కి జలుబు చేస్తే, తెలంగాణలో ఒక వర్గం ప్రజలకి తుమ్ములు వచ్చేవి. అధికారం పోయిన తర్వాత ఆ వర్గం ప్రజలు కూడా కేసీఆర్‌ని పట్టించుకోలేదు. ఇక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మూడు నెలలకు పైగా తీహార్ జైల్లో వుంటే, పాపం అన్న ప్రజలే లేరు. అడపాదడపా కేటీఆరో, హరీష్ రావో తప్ప స్పందించినవారే లేరు. ప్రజా సంఘాల వారుగానీ, గతంలో కవితతో కలసి బతుకమ్మ ఆడిన మహిళా సంఘాలవారుగానీ పాపం అన్న పాపాన పోలేదు.
పార్లమెంట్ ఎన్నికలలో అయినా బీఆర్ఎస్ కోలుకుని వుంటే పరిస్థితి వేరుగా వుండేది. కానీ బీఆర్ఎన్‌ని ప్రజలు మరచిపోయారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బస్సు యాత్ర చేసి హడావిడి చేసినా, రైతుల కోసం పోరాటం అంటూ సందడి చేసినా జనం పట్టించుకోలేదు. ఇదంతా కేసీఆర్ ఎన్నికల సందర్భంగా చేస్తున్న హడావిడే అని గ్రహించినట్టున్నారు. అందుకే సున్నా సీట్లతో సత్కారం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ గానీ, ఆయన కుటుంబం గానీ ప్రజా సమస్యల గురించి స్పందించిన దాఖలాలే లేవు. కేసీఆర్ అయితే ఎప్పటిలాగానే తన ఫామ్ హౌస్‌లో రెస్టు తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి పార్టీని గానీ, ఇలాంటి నాయకులను గానీ, తెలంగాణ ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? కేసీఆర్ గానీ, కేసీఆర్ కుటుంబ నాయకులు గానీ ఇదే ధోరణిలో కొనసాగితే కేసీఆర్‌ని కూడా జనం మరచిపోతారు అనడం ఎలాంటి సందేహం అవసరం లేదు.