జులై 8 కోసం జగన్ ఎదురుచూపులు!
posted on Jun 24, 2024 @ 2:50PM
2029లో మళ్ళీ అధికారం వస్తుందని జగన్ నిరీక్షణ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే ప్రారంభమైంది. ఈ ఐదేళ్ళు నిద్రపోయాం... ఇంకో ఐదేళ్ళు నిద్రపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అని జగన్ తన పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్పారు. ఈ ఐదేళ్ళూ ఆయన తనకు జీవితంలో దక్కని అధికారం కోసం ఎదురుచూస్తూనే వుంటారు... అది వేరే విషయం! దీనితోపాటు జగన్ ఎదురు చూస్తున్న అంశం మరొకటి వుంది.. అది... జులై 8వ తేదీ ఎప్పుడు వస్తుందా... అని!
జులై 8.. ఏమిటీ తేదీకి వున్న ప్రత్యేకత? ఆ రోజున జగన్ కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం వుందా? లేదా ఆ రోజున జగన్‌ని అరెస్టు చేసే అవకాశం ఏమైనా వుందా? ఆ రోజుకున్న ప్రత్యేకత ఏమిటనే ఆలోచన అందరిలో కలగటం సహజం.. ఆ రో్జుకు వున్న ప్రత్యేకత ఏమిటంటే... అది జగన్ తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఆ రోజున వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మొత్తం ఇడుపులపాయలో వున్న ఆయన సమాధి దగ్గరకి వెళ్తారు. ఆయనకు నివాళులు అర్పిస్తారు. జగన్ ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నది తన తండ్రికి నివాళులు అర్పించడానికి అనుకోవద్దని మనవి.. జగన్ ఎదురు చూస్తున్నది ఆ రోజన తన చెల్లెలు షర్మిలతో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆకాంక్షతో.
ఈసారి ఎన్నికలలో జగన్ ఓడిపోవడంలో షర్మిల కూడా తనవంతు పాత్రని పోషించారు. ‘హు కిల్డ్ బాబాయ్’ అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. కడప స్థానం నుంచి తాను గెలవలేకపోయిన్పటికీ, జగన్ ఓటమిలో ఆమె తన విజయాన్ని చూసుకున్నారు. ఆ రోజుల్లో జగన్ కోసం ఎంతో శ్రమించిన షర్మిలకి, జగన్‌కి మధ్య విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణాలు ఒకటి ఆస్తి.. రెండు భారతి అనే విషయం బహిరంగ రహస్యమే. షర్మిలతో విభేదాలను పెంచి పెద్ద చేసుకోవడం వల్ల జగనే ఎక్కువ నష్టపోయారు. సొంత తల్లి, చెల్లి జగన్‌ని వ్యతిరేకిస్తున్నారన్న పాయింట్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఇది కూడా జగన్ అధికారాన్ని కోల్పోవడానికి తనవంతు సహకారాన్ని అందించింది. అంతే కాకుండా, కుటుంబంలో పూల్చలేనంతగా అగాథం పెరిగిపోయింది. దాంతో ఇంట ఓడి, రచ్చ ఓడిన పరిస్థితిలో జగన్ పడిపోయారు.
షర్మిలతో విభేదాలు పెంచుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని అధికారం కోల్పోయిన తర్వాత గానీ జగన్ అర్థం చేసుకోలేకపోయారు. జగన్ వదిలిన బాణం పేరుతో జనంలోకి వెళ్ళి పార్టీకి ఉపయోగపడిన షర్మిల ఇప్పుడు జగన్‌కే బాణంలా గుచ్చుకుంది. దాంతో తన చెల్లెలి పవరేంటో తెలుసుకున్న జగన్ ఇప్పుడు ఆమెతో శత్రుత్వం లేకుండా చూసుకోవాలని భావించారు. తామిద్దరి మధ్య సఖ్యత నెలకొల్పే బాధ్యతను తమ తల్లి విజయమ్మకి అప్పగించారు. అయితే జగన్‌తో సఖ్యంగా వుండటానికి షర్మిల నో చెప్పారు. నేను వైసీపీలోకి రావడం కాదు.. జగనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేసుకొమ్మను అని నిర్మొహమాటంగా చెప్పేశారు. దాంతో విజయమ్మ రాయబారం అసంపూర్ణంగా మిగిలింది.
అయితే పట్టువదలని విక్రమార్కుడిలా జగన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వున్నారు. జులై 8వ తేదీన తాను అనుకున్నది సాధించగలనన్న నమ్మకంతో ఆయన వున్నారు. జులై 8వ తేదీన వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి దగ్గర కుటుంబం అంతా కలిసే సందర్భం కుదురుతుంది. ఈ సందర్భాన్ని షర్మిలకు, తనకు మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించుకోవడానికి మలచుకువడానికి జగన్ ఆలోచిస్తున్నారు. ఆ సందర్భంలో షర్మిలకు, తనకు మధ్య వున్న ఆస్తి వివాదాలు, షర్మిలకు - భారతికి మధ్య వున్న వదిన - ఆడబిడ్డల గొడవలను పరిష్కరించడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా తన తల్లి విజయమ్మను మోటివేట్ చేస్తున్నట్టు సమాచారం. ఆరోజు జరిగే సమావేశం తర్వాత ఈ అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ ‘‘ఒక కొమ్మకు పూచిన పువ్వులం.. అనురాగం మనదేలే.. ఒక గూటికి చెందిన గువ్వలం.. మమకారం మనదేలే’’ అని పాటలు పాడుకుంటారో లేదో వేచి చూడాలి.