ఇక జగన్ బస బెంగళూరు ప్యాలెస్‌లోనేనా?
posted on Jun 24, 2024 @ 4:09PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సొంత రాష్ట్రంలో ముఖం చెల్లని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఆయనకు తాను ముచ్చట పడి నిర్మించుకున్న కోటల్లో అదే ప్యాలెస్ లలో నివాసం ఉండే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. అంతెందుకు ఆయనకు తన సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సభలో క్షణం సేపు కూడా కూర్చోవడానికి సాహసించని జగన్ ఆ మరుసటి రోజు సభకు డుమ్మా కొట్టి పులివెందుల పర్యటనకు చెక్కేశారు. రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించిన ఆయన అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు కాకుండా బెంగళూరులో ఉన్న తన ఎలహంక ప్యాలెస్ కు వెళ్లారు.
పరిశీలకులు, రాజకీయవర్గాలూ కూడా ఇక వచ్చే ఐదేళ్లూ ఆయన బస అక్కడే అంటూ విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ రెడ్డికి ఉన్న ప్యాలెస్ ల పిచ్చితో ఆయన ఎప్పుడో అంటే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బెంగళూరులో ఓ ప్యాలెస్ ఏర్పాటు చేసుకున్నారు. దానిని ఎలా ఏర్పాటు చేసుకున్నారు? అన్నది పక్కన పెడితే గత పదేళ్ల కాలంలో ఆయన బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిన దాఖలాలే లేవు. ఇక ముఖ్యమంత్రిగా గత ఐదేళ్లలో ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారు. చివరాఖరికి ఎన్నడూ సెక్రటేరియెట్ కు కూడా వెళ్లకుండా తన ప్యాలెస్ నుంచే పాలన సాగించారు. ఈ విషయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దె దిగిన తరువాతే బాహ్య ప్రపంచానికి తెలిసింది. అది పక్కన పెడితే... ఎంత సీఎం అయితే మాత్రం ఓ ఇల్లు.. ఓ రెండు కార్లూ సరిపోవా... సరే అదీ కాదనుకుంటే ఓ ప్యాలెస్, ఇంట్లో ఉన్న వారందరికీ ఒక్కో కారు.. అయితే జగన్ మోహన్ రెడ్డి తీరే వేరు. ఆయనకు నగరానికి వీలైతే ఊరికో ప్యాలెస్.. కట్టేసుకోవాలన్న కోరిక బలంగా ఉంది. అందుకే ఆయన ఎక్కడికెడితే అక్కడ ఓ ప్యాలెస్ కట్టేసుకుంటున్నారు.
అది కూడా తన సొంత సొమ్ముతో సొంత జాగాలో కాదు. ప్రభుత్వ జాగాలో, ప్రజల సొమ్ముతో . ఆ బాగోతాలన్నీ ఆయన పదవీ చ్యుతుడైనత తరువాత వెలుగులోకి వస్తున్నాయి. అయితే పాపం ఆయన రాత ఏమిటో కానీ ముచ్చటపడి కట్టుకున్న ప్యాలెస్ లలో ఆయన స్థిమితంగా గడిపింది లేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటంటే 500 కోట్లకు పైగా ప్రజా ధనంతో నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ కనీసం అడుగుకూడా పెట్టలేని పరిస్థితి. పోనీ గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ లో ఉందామంటే.. పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లుగా ముఖ్యమంత్రిగా దర్పం, దర్జా వెలగబెట్టి, నిబంధనలనేవి ముఖ్యమంత్రికి ఉండవన్నట్లుగా ప్రహారీగోడకు 30 అడుగుల ఫెన్సింగ్ నిర్మించుకుని, ప్రధాన రహదారిని మూసేసి మరీ చెలాయించిన పెత్తనం ఇక సాగదు.
అధికారం పోగానే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ రహదారిని వినియోగంలోనికి తీసుకువచ్చేసింది. సో తాడేపల్లి ప్యాలెస్ లో స్థిమితంగా కూర్చోలేని పరిస్థితి. ఇక పోనీ సొంత ఇలాకా పులివెందులలో గడిపేద్దామా అంటే అక్కడ సొంత పార్టీ కార్యకర్తలే ఛీ కొడుతున్నారు. ఇక హైదరాబాద్ లోటస్ పాండ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సో నిరసనలకు దూరంగా ఆయన బెంగళూరు ప్యాలెస్ కు మకాం మార్చేయడానికే ఎక్కువ అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వైసీపీని రాష్ట్రంలో బలోపేతం చేయడం రాజకీయంగా నిలదొక్కుకోవడం సంగతి అంటారా? చెప్పేశారు. కళ్లుమూసి తెరిచేలోగా మన అధికారం పోయింది. అంటే ఐదేళ్లూ గడిచిపోయాయి. మరొక్కసారి కళ్లు మూసుకుంటే ఇట్టే మరో ఐదేళ్లు గడిచిపోతాయి. అప్పుడు ఎన్నికల ముందు జనంలోకి వచ్చి తిరిగితే చాలు మనకు అధికారం వచ్చేస్తుంది అంటూ జగన్ తన పార్టీ నేతలు, శ్రేణులకు ఇప్పటికే వివరించేశారు. అంటే ఐదేళ్ల పాటు జగన్ రాష్ట్రంలో చేసే రాజకీయ కార్యకలాపాలేమీ ఉండవనే అర్ధం. ఆ తరువాత వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ ఓ నాలుగు రోజులు జనంలో తిరిగితే చాలన్నది ఆయన భావనగా కనిపిస్తోంది. సో ఇక ఇప్పుడు జగన్ ఓ ఐదేళ్ల పాటు బెంగళూరులోని తన ఎలహంక ప్యాలెస్‌లోనే గడిపేయడానికే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు.