లాక్డౌన్ ఎందుకు ఎత్తేసారు ? అందుకోసమేనా ?
posted on Jun 21, 2021 @ 11:43AM
ఒకటి రెండు రోజులు అటూ ఇటుగా 40 రోజులుగా, లాక్డౌన్ అంక్షల నడుమ ఉక్కిరి బిక్కిరైన తెలంగాణ జనాలకు, ఆదివారం ఆటవిడుపైంది. శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ఆదివారం జనాలు పంజరం నుంచి బయటపడిన పక్షుల్లా రెక్కలు విచ్చుకున్నారు. జనం ప్రభంజనంలా వీద్దుల్లోకి పరుగులు తీశారు. మాల్స్ ‘ను ముంచెత్తారు, మాసం కొట్లు కిటకిట లాడాయి. చిన్నాచితక షాపులు, టిఫిన్ సెంటర్స్, టీ స్టాల్స్ సంగతి అయితే, చెప్పనక్కర లేదు.హోటల్స్’ కు పాత కళ వచ్చేసింది. పర్యాటక కేంద్రాలు, పబ్లిక్ ప్లేసెస్’లో ఎక్కడ చూస్తే అక్కడ జనం.
నిజానికి, ప్రజలు ఎవ్వరూ కూడా, ప్రభుత్వం ఒక్కసారిగా లాక్డౌన్ ఎత్తేస్తుందని అనుకోలేదు. ఎత్తి వేయాలని కోరుకోలేదు. కరోనా కేసులు తగ్గినా, చావులు నెమ్మదించినా, మహామ్మారి థర్డ్ వేవ్ భయం ప్రజలను వెంటాడుతూనే వుంది. అయితే, ప్రభుత్వం లాక్డౌన్ విధించే సమయంలో ఏ విధంగా అయితే, అత్యవసర నిర్ణయం తీసుకుందో, ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసే సమయంలో కూడా అదే విధంగా అత్యవసర నిర్ణయం తీసుకుంది. అప్పట్లో కరోనా ఉదృతి ఉగ్రరూపం దాల్చినా లాక్డౌన్ విధించేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్న ప్రభుత్వం చివరకు హై కోర్టు జోక్యంతో కానీ, లాక్డౌన్ విధించలేదు. అది కూడా కోర్టు అక్షితలు వేస్తుందన్న భయానికి, కోర్టు తీర్పుకు గంటల ముందు మంత్రివర్గ అత్యవసర సమావేశంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించాలనే నిర్ణయం తీసుకుంది. అప్పటికప్పుడు మంత్రి వర్గ సమావేశం మధ్యలోనే అత్యవసర ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మళ్ళీ, లాక్డౌన్ ఎత్తివేసే విషయంలోనూ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శలు మొదలయ్యాయి.
ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతికి ప్రభుత్వాలు, ప్రజల నిర్లక్ష్యం, కరోనా నిబంధనలను పాటించక పోవడమే ప్రధాన కారణమని , మరోసారి అదే తప్పుచేస్తే థర్డ్ వేవ్, మరింత ఉదృతంగా విరుచుకు పడుతుందని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు. మరో వంక ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా, కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్(B.1.617.2) మరో సారి రూపంతరం చెందడంతో k417N మార్పు చోటు చేసుకొందని, ఇది ఆందోళనకర వేరియంట్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఈపరిస్థితులలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో లాక్డౌన్ ఒక్క సారిగా సంపూర్ణంగా ఎత్తివేయడం, చివరకు జులై ఫస్ట్ నుంచి స్కూల్స్ తెరవాలని నిర్ణయించడంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొనవలసి వస్తోంది.
ఈ నేపధ్యంలోనే బీజీపీ నాయకురాలు విజయశాంతి, రాజకీయ కార్యకలాపాల కోసమే ముఖ్యమంత్రి లాక్డౌన్ ఎత్తివేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు అమాయకులనుకుంటున్నారని అంటూ ఆమె లాక్‌డౌన్ ఎత్తేసిన రోజునే జిల్లాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలు మొదలుపెట్టడం. ఏమిటని ప్రశ్నించారు.ఇదంతా చూస్తుంటే కరోనా తగ్గిపోయిందని ఈ కార్యక్రమాలు పెట్టారో... లేక ఈ మొత్తం ప్రోగ్రాం కోసం తెలంగాణలో కరోనా తగ్గిపోయిందని తప్పుడు నివేదికలు తెప్పించి లాక్ డౌన్ ఎత్తేశారో...అర్థం కావడం లేదని అన్నారు.
మరోవంక టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి రాక మునుపే రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలన్నింటినీ తొలగించడం అనాలోచిత నిర్ణయమని మండిపడ్డారు. పూర్తిగా ఆంక్షల తొలగింపుపై పునరాలోచించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సగం మందికైనా టీకా ఇవ్వలేదని, ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. 6 నుంచి 8 వారాల్లో మూడో వేవ్ విజృంభించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరికలు చేసిందన్నారు. ఈ నేపధ్యంలో ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయడం సరికాదని దశల వారీగా నిబంధనలు సడలించాలని కేంద్రం చేసిన సూచనలు పట్టించుకోకపోవడం ఏమిటని కోదండరామ్ ప్రశ్నించారు.
నిజానికి, రాజకీయ పార్టీలు, నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా, ప్రభుత్వం చేసిన తప్పే మళ్ళీ చేస్తోందని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అలాగే, ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో పునరాలోచన చేయాలని అనేక వర్గాల ప్రజలు కోరుకుంతున్నారు. ముఖ్యంగా స్కూల్స్ రీఓపెన్ చేయాలన్న నిర్ణయం విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతోంది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల వత్తిళ్ళకు తలొగ్గి, వారు ఫీజులు వసులు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తల్లి తండ్రులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. పిల్లు అందరికీ టీకాలు వేసే వరకు ఆన్లైన్ తరగులు మాత్రమే నిర్వహించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ప్రజలు కూడా కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందనే విషయాన్ని మరిచి పొతే థర్డ్ వేవ్’ కు స్వాగతం పలికినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికకు అద్దం పట్టే కార్టూన్ కాప్షన్ ఇది ..
Where is everybody rushing to after the unlock Towardss the third wave, I guess
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్కడికి పరుగులు తీస్స్తున్నారు అంటే.. బహుసా .. థర్డ్ వేవ్ వైపుకు కావచ్చు ..ట నిజమే కదూ... లాక్డౌన్ ఎత్తేశారని ... ఆంక్షలు ఉల్లంఘిస్తే నిజంగా అది థర్డ్ వేవ్ కు స్వాగతం పలకడమే అవుతుంది.తస్మాత్ జాగ్రత్త