కూలైన సీనియర్లు.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి!
posted on Jun 21, 2021 @ 11:15AM
ఆరు నెలలుగా పెండింగులో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ కొత్త పీసీసీ బాస్ ను ఏఐసీసీ ఖరారు చేసిందని ఢిల్లీ వర్గాల సమాచారం. పీసీసీ రేసులో నేతలతో మాట్లాడిన హైకమాండ్... అందరిని కూల్ చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికే పగ్గాలు దక్కనున్నాయి. 15 రోజులుగా హస్తినలోనే మకాం వేసిన రేవంత్ రెడ్డి.. దీనిపై రాహుల్ గాంధీ నుంచి సమాచారం వచ్చిందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఏఐసీసీ నుంచి అధికారక ప్రకటన రానుందట.
పీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అధిష్టానం ఆదివారం ఢిల్లీకి పిలిపించింది. ఢిల్లీకి వెళ్లిన కోమటిరెడ్డితో రాహుల్ దూతలు చర్చలు జరిపారని తెలుస్తోంది.కోమటిరెడ్డిని కూల్ చేయడంతో పాటు అతనికి ఏఐసీసీలో మంచి స్థానం ఇస్తామని హామి ఇచ్చారట. రేవంత్ రెడ్డితో కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని హైకమాండ్ కు కోమటిరెడ్డి హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో కలిసి సరదాగా మాట్లాడుకున్నారు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి. పీసీసీ ఎవరికి వచ్చినా సమిష్టిగా పని చేద్దామని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అందులో భాగంగానే పీసీసీ రేసు విషయంలోనూ ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని అంటున్నారు.
టీపీసీసీ రేసులో ఉన్న శ్రీధర్ బాబు, జగ్గారెడ్డితో పాటు రేవంత్ రెడ్డి అభ్యర్థితత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన నేతలతోనూ ఏఐసీసీ పెద్దలు స్వయంగా మాట్లాడారని తెలుస్తోంది. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ బోసు రాజు... ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వీహెచ్ తో మాట్లాడి సర్ది చెప్పారని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీకి మంచి అవకాశాలు ఉన్నందున.. అందరం కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని బోసు రాజు చెప్పగా.. సీనియర్ నేతలంతా అంగీకరించారని గాంధీ వర్గాలు చెబుతున్నారు.
మరోవైపు పీసీసీ చీఫ్ తో పాటు మిగితా పదవుల భర్తీపైనా హైకమాండ్ క్లారిటీ ఇచ్చిందని అంటున్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా కూర్పు చేశారని తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మైనార్టీ వర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహను ఖరారు చేశారని సమాచారం. బీసీ వర్గం నుంచి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ఏఐసీసీ తీసుకోవాలని నిర్ణయించారట. బీసీ కోటాలో మధు యాష్కీని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించవచ్చని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఏఐసీసీలో కంటిన్యూ అవుతారని చెబుతున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీలో సముచిత స్థానం దక్కనుందని చెబుతున్నారు.
సీఎస్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కను అదే పోస్టులో కొనసాగించి.. శ్రీధర్ బాబుకు పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రచార కమిటి సారథిగా జీవన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే సీతక్కకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కీలక పదవి కట్టబెట్టనుందని చెబుతున్నారు. మొత్తంగా టీపీపీసీలో పెండింగులో ఉన్న పదవుల పంపకాన్ని హైకమాండ్ కొలిక్కి తెచ్చిందని పక్కాగా తెలుస్తోంది.