ఉద్రిక్తతకు దారి తీసిన ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ...
posted on Oct 17, 2019 @ 2:47PM
ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రాంనగర్ దగ్గర ప్రారంభించి సిటీలో అన్ని డిపోలను కలుపుతూ ర్యాలీ చేయాలనుకుంది జీఏసీ కానీ, సభలకు, ర్యాలీలకు అనుమతులు లేని కారణంగా వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థులు నిర్వహించ తల పెట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ముందస్తుగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన విద్యార్ధిలందరినీ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి స్థాయి ఉద్రిక్తల మధ్యనే బైక్ ర్యాలీ ఆగిపోయింది, మరల బైక్ ర్యాలీ నిర్వహించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. అయితే పోలీసుల బందోబస్తు రాంనగర్ చౌరస్తా వద్ద పెరిగింది. ఏ ఒక్కరైనా ఆర్టీసీకి సంబంధించి స్లోగన్స్ ఇచ్చినా లేకపోతే ప్లకార్డులతో ప్రదర్శించినా కూడా అరెస్టు చేసి తీసుకెళ్లి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి అప్పజెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం రాంనగర్ చౌరస్తాలో మాత్రమే కాకుండా రాంనగర్ చౌరస్తాకి వస్తున్న దారిలో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.
రాంనగర్ కు కలిసిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలన్నిటిలో కూడా పోలీసులు గస్తీ కాస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ అనుమతులు లేవంటూ ఆపేయాలని ఇప్పటికే పోలీసులు హెచ్చరించడం జరుగుతోంది. మీడియాతో కార్మికులు మాట్లాడుతూ, ఆత్మబలిదానాలు చేసుకోవద్దు అని ప్రభుత్వం హెచ్చరిస్తుంది కోర్టులు కూడా చెప్తున్నాయి కానీ, తమ సమస్యలు తీర్చేవారు లేరని కాబట్టి ఖచ్చితంగా పోరాడి తమ హక్కుల్ని సాధించుకుంటాం అని అన్నారు. అయితే ప్రస్తుతం రాంనగర్ వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది.