డబుల్ మసాలా పొలిటికల్ బిర్యానీ.. ఎవరి గోల వారిదే..
posted on Jul 12, 2021 @ 1:01PM
రాజకీయాల్లో రాత్రికి రాత్రే ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. ఇవాళ ఓ పార్టీలో ఉన్నోళ్లు.. రేపటికల్లా మరోపార్టీలో కనిపిస్తున్నారు. పొద్దున్న ఆ నేత ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు భుజంపై ఏ పార్టీ కండువ ఉంటే.. ఆయన ఆరోజుకు ఆ పార్టీలో ఉన్నట్టు.. అని భావించాల్సిన రోజులివి. ఈటల నుంచి ఎల్.రమణ వరకూ అదే జరుగుతోంది.
ఇటీవల తెలంగాణ పాలిటిక్స్ అత్యంత వేగంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేనంత పొలిటికల్ యాక్టివిటీ కనిపిస్తోంది. షర్మిల, ఈటల, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, కిషన్‌రెడ్డి, కోదండరాం, ఎల్.రమణ, కోమటిరెడ్డి, కౌశిక్‌రెడ్డి.. ఇలా అనేక మంది నేతలు నిత్యం వార్తల్లో ఉంటున్నారు. వారి పేరుమీద ఏదోఒక హడావిడి నడుస్తూనే ఉంది. తెలంగాణలో అప్పుడే ఎన్నికలు వచ్చినంత హంగామా.
ఈటల ఎఫెక్ట్ కాకరేపుతోంటే.. అదే సమయంలో రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావడం మరింత పొలిటికల్ హీట్ పెంచేసింది. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ ఇటు టీఆర్ఎస్‌లో, అటు కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. బటర్ ఫ్లై ఎఫెక్ట్‌లా.. ఈటల ప్రభావంతో ఎల్.రమణ, కౌశిక్‌రెడ్డిల రాజకీయ తలరాత మరిపోతుంటే.. రేవంత్‌రెడ్డి దెబ్బకు కోమటిరెడ్డి, కోదండరాం, షర్మిలల రాజకీయ భవితవ్యం సందిగ్థంలో పడిందని అంటున్నారు.
ఇక, రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ మామూలుగా లేదు. యావత్ తెలంగాణ రాజకీయాలను ఆ ఒక్కడే అతలాకుతలం చేస్తున్నారు. అటు రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పగించగానే.. కోమటిరెడ్డి రూపంలో ఏకైక నిరసన స్వరం వినిపించింది. వెంటనే ఆ ధిక్కార స్వరాన్ని గొంతుపిసికి చంపేశారని అనుకున్నా.. అది ఈసారి ఢిల్లీలో రీసౌండ్‌గా వినిపించింది. ఏ పీసీసీ చీఫ్ పోస్ట్ కోసమైతే ఆరు నెలల పాటు ఆహోరాత్రులు గట్టిగా ప్రయత్నించారో.. ఆ పీసీసీ చీఫ్ పదవి తనకు చిన్న పదవి అంటూ కామెడీగా మాట్లాడారు కోమటిరెడ్డి. బహుషా.. అందని ద్రాక్ష పుల్లన అంటే ఇదేనేమో..
కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి కలకలం రేపారు. ఈశాన్య రాష్ట్రాల్లో కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన కంపెనీ.. పలు కాంట్రాక్టులు చేస్తోంది. ప్రస్తుతం కిషన్‌రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా కూడా ఉన్నారు. అలా వ్యాపార ప్రయోజనాల కోసమే.. కోమటిరెడ్డి స్వపక్షంలో విపక్షంలా మారారా? లేక, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి దారిలోనే ఆయన సైతం కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? అనే డౌటనుమానం...!
మరోవైపు ఏళ్లుగా టీడీపీని అంటిపెట్టుకున్న ఎల్.రమణ.. ఇక తనవల్ల కాదని కాడి దించేస్తున్నారు. ఈటలకు కౌంటర్‌గా బలమైన బీసీ నేత అన్వేషణలో ఉన్న కేసీఆర్ వలకు ఎల్.రమణ చిక్కేశారు. లేటైతే.. చెక్‌పోస్ట్ పడుద్ది.. రమణా.. లోడెత్తాలిరా... అంటూ ఈటలకు పోటీగా బీసీల భారం ఎల్.రమణ భుజాలపై మోపేందుకు సిద్ధమువుతున్నారు గులాబీ బాస్. రమణ సైతం కట్టప్ప వారసుడిలా సింహాసనానికి కట్టుబడి పనిచేసేందుకు రెడీ అయిపోతున్నారు.
ఇక, కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి ఝలక్ మామూలుగా లేదు. తనకు హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందంటూ వైరల్‌గా మారిన ఫోన్ ఆడియో.. ఆయన రాజకీయ తలరాతను తలకిందులు చేసేయనుంది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు దగ్గరి బంధువు అయిన కౌశిక్.. ఇప్పుడు తాజా పీసీసీ చీఫ్ రేవంత్ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. హుజురాబాద్‌లో కౌశిక్‌ను సైడ్ చేసి పొన్నంను పోటీ చేయించాలని భావిస్తున్న రేవంత్‌కు మార్గం మరింత సులువైనట్టే అంటున్నారు. అటు ఇంత జరిగాక కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ వస్తుందో రాదో తెలీదు.. వచ్చినా.. పార్టీ మారిన ఆయన్ను ఓటర్లు ఆదరిస్తారో లేదో తెలీదు.. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆయన రెబెల్‌గా పోటీ చేసినా చేస్తారు.. అదే జరిగితే.. కౌశిక్‌రెడ్డి చీల్చబోయే ఓట్లు ఎవరికి లాభిస్తాయో? ఎవరిని గెలిపిస్తాయో?
బలమైన నేతలంగా కీలకంగా మారడంతో.. పాపం కోదండరాం సార్ పరిస్థితి ఎటూ కాకుండా పోతోంది. అసలింతకి ఆయన పార్టీ ఉందో లేదో తెలీని దుస్థితి. సండట్లో సడేమియాలో.. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారంటూ ప్రచారం మొదలైపోయింది. కాదు మొర్రో అని కోదండరాం సార్ మొత్తుకుంటున్నా.. ఎవరూ నమ్మేలా లేరు. ఉద్యమకాలం నుంచి ఉన్న కోదండరాం పరిస్థితే ఇలా ఉంటే.. నిన్నకాక మొన్న.. తెలంగాణ కోడలి నంటూ వచ్చిన షర్మిల.. కొత్త పార్టీ ఆవిర్భావోత్సవంతో అదరగొట్టింది. కాసులు కుమ్మరించి.. సినిమా ఈవెంట్‌లా ధూంధాంగా పార్టీ ప్రారంభించారు. ఆమె గెలుస్తారు.. రాజన్నరాజ్యం వస్తుందనే ఆశ ఎవరికీ లేకపోయినా.. షర్మిల చీల్చబోయే ఓట్లు ఎవరికి మైనస్.. ఎవరికి ప్లస్ అనేదే కీలకం. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గానే షర్మిల పార్టీ పెట్టారనే విశ్లేషణ మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకే, రేవంత్ సైతం షర్మిల దుమ్ము దులిపేస్తున్నారు. వైఎస్సార్‌టీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌ను కాచుకుంటూనే.. పార్టీని డిస్టర్బ్ చేస్తున్న కోమటిరెడ్డి, కౌశిక్‌రెడ్డిలాంటి వారికి చెక్ పెట్టే పనిలో బిజీగా ఉన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
ఇలా ఇటు రేవంత్‌రెడ్డి.. అటు ఈటల రాజేందర్ + బండి సంజయ్ + కిషన్‌రెడ్డి టీమ్.. మరోవైపు కేసీఆర్, ఎల్.రమణ రాజకీయం.. సండట్లో సడేమియాలా షర్మిల పార్టీ.. ఆటలో అరటిపండులా కోదండరాం సారు.. అంతాకలిసి తెలంగాణ రాజకీయాల్ని మునుపెన్నడూ లేనంత రంజుగా మార్చేశారు. హుజురాబాద్ ఎలక్షన్ వరకూ ఈ ఎపిసోడ్ సలసల కాగాల్సిందే....