ఉపఎన్నిక కాదు కుంభస్థలమే కొట్టాలి.. ఇదేనా రేవంత్ వ్యూహం?
posted on Jul 12, 2021 @ 1:01PM
రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రేవంత్ కాకుండా ఇంకెవరు పీసీసే చీఫ్ అయినా ఇంత జోష్ ఇంత ఉత్సాహం వచ్చేది కాదు. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ శ్రేణులే కాదు, మీడియా, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు కూడా గుర్తించారు. అంతే కాదు, రాజకీయ ప్రత్యర్ధులు కూడా జాగ్రత్త పడుతున్నారు.
రేవంత్ రెడ్డి పేరు ప్రకటించీ ప్రకటించక ముందునుంచే, ముఖ్యమంత్రి కేసీఆర్’లో కదలిక మొదలైంది. ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ దాటి బయటకు రాని, ముఖ్యమంత్రి గేటు దాటి కాలు బయట పెట్టారు.ఏదో వంకన ప్రజల మధ్యకు వెళుతున్నారు.ఉరూర తిరుగుతున్నారు, ప్రజలకు వాగ్దానాలు చేస్తున్నారు. పిట్ట కథలు చెపుతున్నారు. పగలబడి నవ్వుతున్నారు. జనాన్ని నవ్విస్తున్నారు. ప్రతిపక్షాల పై ఎప్పటి లానే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను మళ్ళీ,మళ్ళీ ఏకరవు పెడుతున్నారు. చివరకు, పెండింగ్’లో పడిపోయిన ఉద్యోగ ప్రకటనల దుమ్ము దులిపారు. బయటకు తీశారు. అలాగే, అధికార పార్టీ నాయకులు కూడా. రేవంత్’కు ముందు తర్వాత అన్న బేధాన్ని పాటిస్తున్నారు.
ఇక ఇంత కాలం తెరాసకు ప్రత్యాన్మాయం తామే అని ప్రగల్బాలు పలికిన బీజేపీ నాయకులు ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు. పత్రికల న్యూస్ ప్రియారిటీలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. లోపలి పేజీల్లో దాక్కున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ వార్తలు ఫ్రంట్ పేజీకి వచ్చేసాయి. బీజేపీ, బండి సంజయ్ లోపలి పేజీల్లోకి జారి పోయారు. ఒక్క మాటలో చెప్పలంటే, రేవంత్ రాకతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారి పోయింది.అయితే, ఇదంతా నాణ్యానికి ఒక పక్క మాత్రమే, రెండో పక్కన చూస్తే రేవంత్ రెడ్డి ముందు చాలా చాలా సవాళ్లున్నాయి.
అన్నిటికంటే ముందు, హుజూరాబాద్ ఉప ఎన్నిక పెను సవాల్ విసురుతోంది. అయితే రేవత్ రెడ్డి, హుజూరాబాద్ ఉప ఎన్నికను, అంత సీరియస్’గా తీసుకోవడం లేదు. ఒక టీవీ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఇదే విషయం చెప్పారు. హుజూరాబాద్ ఎప్పుడూ కాంగ్రెస్ నియోజక వర్గం కాదు. గడచిన 30 ఏళ్లలో అక్కడి నుంచి కాంగ్రెస్ ఒక్క సారి కూడా గెలవలేదు. టీడీపీ లేదంటే తెరాసనే గెలుస్తూ వచ్చాయి.గడచిన 16 ఏళ్లుగా అయితే, ఈటల రాజేందరే గెలుస్తున్నారని రేవంత్ చెప్పు కొచ్చారు. కాబట్టి, హుజూరాబాద్ గెలుపు ఓటమలు తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తును లేదా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్నయించవని తేల్చేశారు. ఇలా హుజూరాబాద్ విషయంలో పూర్తి క్లారిటీ ఉంది కాబట్టే, రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను, కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ చైర్మన్,మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు అప్పగించారు.
నిజమే, పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదురైనా తొలి సవాలు విషయంలోనే రేవంత్ రెడ్డి వెనకడుగు వేయడం, ప్రత్యర్ధులకు అస్త్రం అవుతుందేమో కానీ, రాజకీయంగా చూస్తే మాత్రం రేవంత్ నిర్ణయం సరైన నిర్ణయంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, పోటీ పడితే అసెంబ్లీ ఎన్నికల్లో, స్పష్టమైన విధానాలు, ఎన్నికల ప్రణాళికతో కేసీఆర్’తో తలపడాలే కానీ, ఉప ఎన్నికలలో గెలుపు కోసం ఉబలాట పడ్డం వలన దీర్ఘ కాల ప్రయోజనాలు ఉండవు, రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. అదే వ్యూహంతో ముందుకు పోతున్నారు. అలాగని రేవంత్ రెడ్డి హుజూరాబాద్ వరకు అస్త్ర సన్యాసం చేశారని కాదు, ఆ విషయం కూడా ఆయనే చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తగా శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తానని, అయితే గెలుపు ఓటములకు అంత ప్రాధన్యత ఇవ్వనని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ అనుభవం కూడా అదే చెపుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలుపు తర్వాత తెరాసకు బీజేపీనే ప్రత్యాన్మాయం అనుకున్నారు. కానీ, ఆ వెంటనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ గెలుపు బలుపు కాదు వాపు అని తేలిపోయింది. సిట్టింగ్ సీటులో బీజేపీ ఓడిపోయింది, నాగార్జున సాగర్’ ఉప ఎన్నికలో అయితే ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. బుడగ పేలిపోయింది. కాబట్టి గాలివాటంగా గెలిచినా/ ఓడిపోయినా ఉపన్నికలు, స్థానిక ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవడం, రాజకీయ విజ్ఞత అనిపించుకోదని రేవంత్ రెడ్డి అభిప్రయా పడుతున్నారు. అనుదుకే కావచ్చు, రేవంత్ రెడ్డి కేసీఆర్ కుంభస్థలం టార్గెట్’గా వ్యూహ రచన చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే, అలాగని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ మీద ఆశలు వదిలేసుకుంది అనుకునేందుకు వీలు లేదు,ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి ఇంచుమించుగా 70 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కాబట్టి గట్టి అభ్యర్ధిని నిలబెట్టి పార్టీ ఓటు బ్యాంక్’ను కాపాడు కోవడం అవసరం. అయితే, కౌశిక్ రెడ్డి తెరాసలో చేరుతున్నట్లు వస్తున్నవార్తలు నిజమైతే, కాంగ్రెస్ పార్టీకే కాకుండా రేవత్ రెడ్డి ఇమేజ్’కి కూడా కొంత కోత పడుతుందని, పరిశీలకులు భావిస్తున్నారు. రేవంత్ వచ్చినా ... ఫిరాయింపులు ఆగలేదు ... అనే మెసేజ్ జనంలోకి వెళ్లి పోతుంది. ఆ మచ్చ అలా మిగిలిపోతుంది. ఇప్పటికే, గత ఎన్నికల్లో గెలిచిన 19 మందిలో 12 మంది కారెక్కేశారు. ఆవిధంగా కాంగ్రెస్’ను గెలిపించినా చివరకు అందరూ చేరేది, గులాబీ గూటికే అన్న భావన బలంగా నాటుకు పోయింది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డికి పరీక్షగా మారుతుందని, రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.