తొడలు చరుస్తున్న తెలంగాణ రాజకీయం.. తిట్లు వచ్చినోడిదే రాజ్యం!
posted on Aug 31, 2021 @ 1:39PM
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సవాళ్ల అధ్యాయం నడుస్తోంది. మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ళు, ప్రతి ససవాళ్ళ ప్రహసనం ఒకటి రంజుగా సాగుతోంది. ఈ సవాళ్ల వ్యవహారం ఒక విధంగా రాజకీయ భాషను మార్చి వేసింది. బూతు పురాణం స్త్యైకి దిగజార్చింది. ఇంతవరకు ఎపీలోనే ఉన్నారనుకున్న బూతు మంత్రులు తెలంగాణలోనూ తక్కువ కాదని మంత్రి మల్లా రెడ్డి నిరుపించారు.
అసలే హుజూరాబాద్ ఉప ఎన్నిక కాకమీదున్న తెలంగాణ రాజకీయం ఈ సవాళ్లతో మరింత వేడెక్కింది. మంత్రి మల్లారెడ్డి భూఆక్రమణలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయట పెట్టారు. మంత్రి మళ్ళా రెడ్డి కబ్జాకోరని రేవంత్ రెడ్డి ఆరోపించారు.రేవంత్ రెడ్డి విమర్శలకు ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి, బూతు పురాణం ఎత్తుకున్నారు. ఇద్దరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామని.. దమ్ముంటే రాజీనామా చేయాలని తొడగొట్టి మరీ సవాలు విసిరారు. మరో వంక, ఈ వివాదంలో వేలు పెట్టిన మంత్రి కేటీఆర్ మల్లారెడ్డికి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోని వాళ్లు ఆయనకే వాళ్లు విసురుతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇలా రేవంత్, మాలల రెడ్డి మధ్య సవాలుగా మొదలైన, సవాళ్ల ప్రహసనం అనేక మలుపులు తిరుగుతోంది.
ఆ ప్రహసనం అలా నడుస్తుండగానే, మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్, మరో సవాల్ గోలకు తెర తీశారు. ఈటల ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు కు జాయింట్ గా సవాల్ విసిరారు. దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్ బరిలో దిగాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కేసీఆర్ లేదా హరీష్ రావు (ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తే వారు) గెలిస్తే.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని.. తాను గెలిస్తే కేసీఆర్, హరీష్ తమ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఈటల సవాల్ విసిరారు. అయితే ఈటల సవాలుకు అటు నుంచి స్పందన లేదు కానీ, ఊరుకుంటారని అనుకోలేము. అలాగే 2001లో తెరాస ఆవిర్భావం నాటికి తన ఆస్తులు ఎన్నో చెబుతానని.. సీఎం కేసీఆర్ కూడా చెప్పాలని ఈటల మరో సవాల్ కూడా యాడ్ చేశారు. ఇక ఈకథ ఎటు సాగుతుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడవలసిందే.
రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు పత్రికల పతాక శీర్షికలకు, మీడియా కాలక్షేపానికి పనికొస్తాయే కానీ, అంతకు మించి ఇంకేదో జరుగుతుందని అనుకోలేము.ఆశించ కూడదు. గతంలోనూ ఇంతకంటే, గొప్ప నాయకులే ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకున్నారు. కానీ, కట్టుబడిన ఇష్యూని ఒక లాజికల్ కంక్లూజన్’కు తీసుకు పోయిన సందర్భం ఎక్కడా ఒక్కటి కూడా లేదు. అంతే కాదు, ఈ సవాళ్ళ పర్వం ఇంతటితో అయిపోయిందని కూడా అనుకోలేము. సో.. ఇవి కూడా అంతే..ఎన్నికల వరకు ఇలా సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం సాగుతూనే ఉంటుంది. కొత్త నీరొచ్చి పాట నీరు కొట్టుకుపోయినట్లుగా, కొత్త సవాళ్ళు వచ్చి పాత సవాళ్ళను తుడిచేస్తాయి. అంటే కానీ, ముగింపు మాత్రం ఉండదు. ఇదొక రాజకీయ కాలుష్య ప్రవాహం .. అలా సాగుతూనే ఉంటుంది.
ఇక్కడొక చిన్న కొసమెరుపు ఏమంటే, ‘మాట తప్పం, మడమ తిప్పం’ అనే ట్యాగ్లైన్ తగిలించుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై టీడీపీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ .. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా విసిరిన సవాలుకు ఇంత వరకు స్పందన వచ్చిందే లేదు.