తాగినోడికి తాగినంత.. సర్కారుకు అప్పు మీద అప్పు ముట్టేంత!
posted on Aug 31, 2021 @ 12:50PM
90ml సీసాలు తీసుకొచ్చి మందుబాబులకు బాగా కంఫర్ట్ కలిగిస్తోంది ఏపీ సర్కారు. ఎంచక్కా చాటుగా జేబులో పెట్టుకోవచ్చు. ఎవరికీ కనిపించదు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మొబైల్ కంటీ ఈజీగా జేబులో సర్దేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ గుటుక్కున మింగేయవచ్చు. ఒకేసారి నాలుగైదు చిన్న సీసాలు కొనేసుకొని.. జేబులోనో, బ్యాగులోనో పెట్టేసుకొని.. అప్పుడింత అప్పుడింత మందేసుకోని.. రోజంతా మత్తులోనే జోగొచ్చు. ఇక టిన్ బీర్లతో మరింత మజా. క్యాన్ పట్టుకొని స్టైల్‌గా ఫోజులు కొడుతూ బీర్ సిప్ చేయొచ్చు. పబ్లిక్ ముందు ఫోజులు కొట్టేందుకు ఇది మరింత చక్కని ఛాన్స్. అందుకే ఇంత మంచి సర్కారు ఇంకెక్కడైనా ఉంటుందా అని తాగుబోతులు జగనన్న ఫోటోను జేబులో పెట్టుకొని తిరుగుతున్నారట.
కాకపోతే మందుతాగుతున్న ప్రతీసారీ అదేదో విషం తాగుతున్నట్టు ఉంటోందట. ఊరూ-పేరు లేని పనికిమాలిన సరుకంతా అమ్ముతుండటంతో మందు గొంతు దిగడం లేదట. ఆ చెత్త మందు తాగలేక.. తాగకుండా ఉండలేక.. సిప్పు సిప్పుకీ జగనన్నకి శాపనార్థాలు పెడుతున్నారు మందుబాబులు. అంతెందుకు, జగన్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ సైతం మందు విషయానికి వచ్చే సరికి మావోడు దెబ్బేశాడంటూ దొబ్బులు దొబ్బుతున్నారు. ఇలా మందు విషయంలో మద్యంప్రియులను నిలువునా మోసం చేసిన జగన్.. ఐదేళ్లలో మద్య నిషేధం అని కల్లబొల్లి మాటలు చెప్పి ఏపీ ప్రజలనూ దగా చేశారని మండిపడుతున్నారు. షాపులు తగ్గించి.. ధరలు పెంచేసి.. కాసులు దండుకుంటున్నారే తప్ప.. మద్య నిషేధం ఊసే ఎత్తడం లేదని తిడుతున్నారు జనాలు. ఈ మద్యం దందా చాలదన్నట్టు.. లిక్కర్ బిజినెస్‌నే ష్యూరిటీగా చూపించి వేల కోట్లు అప్పులు తెస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే. ఇక అప్పుల యవ్వారం ఎలా సాగుతోందంటే....
ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి దొడ్డిదారిన రూ.21,500 కోట్లు అప్పు తెచ్చింది ఏపీ ప్రభుత్వం. మళ్లీ మద్యం ఆదాయాన్నే నమ్ముకుని మరో 25 వేల కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 30 మద్యం డిపోలు ఉన్నాయి. ఇవన్నీ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలోనివే. మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం విధించిన ప్రభుత్వం... పది మద్యం డిపోల పరిధిలో వచ్చే ఆదాయాన్ని నేరుగా ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్’ (ఏపీఎస్‌డీసీ)కి మళ్లించి.. దానిని హామీగా చూపించి రూ.21,500 కోట్ల అప్పు తెచ్చింది. అలా తెచ్చిన అప్పుతోనే సంక్షేమ పథకాల బండి లాగిస్తోంది. ఇలా పన్ను ఆదాయాన్ని నేరుగా ‘ఎస్ర్కో’ చేయడం రాజ్యాంగ విరుద్ధం. అసలు ఏపీఎస్‌డీసీ ఏర్పాటునే కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. అలా అప్పులు తేవడం తప్పని తేల్చింది. అయినా సర్కారు తీరు మారలేదు. ఇప్పటికే పది డిపోల పరిధిలో మద్యంపై వచ్చే అదనపు ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు మిగిలిన 20 డిపోల ఆదాయంపై కన్నేసింది. అయితే... గతంలో నేరుగా ‘ఎస్ర్కో’ చేసి ఇరుక్కుపోవడంతో, ఇప్పుడు కొత్త దారి వెతుక్కున్నట్టు తెలుస్తోంది.
కొత్త ‘స్కీమ్’లో భాగంగా.. నేరుగా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే అప్పు తెచ్చుకుంటారు. పైకి ఇందులో ఎక్కడా ప్రభుత్వ పాత్ర కనిపించదు. కానీ... అప్పు ద్వారా తెచ్చుకున్న డబ్బులు మాత్రం ప్రభుత్వానికే పోతాయని అనుమానాలున్నాయి. బేవరేజెస్ కార్పొరేషన్ 20 డిపోల పరిధిలో మద్యంపై విధించే ఏఆర్‌ఈటీని హామీగా చూపిస్తుంది. ఈ ఖాతాలో రోజూ రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ మొత్తాన్ని ఏ రోజుకు ఆ రోజు తిరిగి చెల్లిస్తాం అనే హామీ ఇస్తూ రుణం తెచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బేవరేజెస్ కార్పొరేషన్ తీసుకునే అప్పు, అంతిమంగా సర్కారు ఖాతాలోకే వెళుతుందని చెబుతున్నారు.
గత ఏడాది మార్చిలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బేవరేజెస్ కార్పొరేషన్ తీసుకున్న రూ.1400 కోట్ల క్యాష్ క్రెడిట్ లోన్ చెల్లించడానికే ఆ కార్పొరేషన్ ఆపసోపాలు పడుతోంది. ఈ రుణం కాలపరిమితి ఆరు నెలలు. దీనిని కూడా చెల్లించలేని సంస్థ... గడువులోపు రూ.1400 కట్టేసి, మళ్లీ మరుసటి రోజునే అంతే మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. అలాంటిది దీనిని నమ్మి రూ.25 వేల కోట్లు అప్పు ఇచ్చేందుకు ఏ బ్యాంకు ముందుకు వస్తుందో? కేంద్రం షంటింగ్స్‌తో ఏపీకి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ బ్యాంకులు ‘ఓకే’ చెప్పగానే.. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చుకొనే ఏర్పాట్లలో ఉంది జగన్‌రెడ్డి సర్కారు. ఇలా మద్యం ఆదాయం మీదనే ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉన్నప్పుడు.. ఇక సంపూర్ణ మద్య నిషేధం హామీ బీరు పొంగులా కారి పోయినట్టేనా?