చింతమనేనిని చంపాలనుకున్నారా?
posted on Aug 31, 2021 @ 2:02PM
చింతమనేని ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో సంచలనం. ప్రజా పోరాటమైనా, అభివృద్ధి కార్యక్రమమైనా... అధికార పార్టీలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా ఆయన రూటే సెపరేటు. నిత్యం ఎదో ఒకటి చేస్తూ వార్తల్లో ఉంటారు. ప్రజల కోసం కొన్ని సార్లు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తూ ఇబ్బందుల్లో పడుతుంటారని అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కీలక నేతగా ఉన్న చింతమనేని ప్రభాకర్.. దెందులూరు నుంచి అసెంబ్లీకి పలుసార్లు గెలిచారు. గత టీడీపీ హయాంలో ప్రభుత్వ విప్ గా పని చేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు చింతమనేని ప్రభాకర్.
ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. తన పార్టీ అధికారంలో లేకున్నా ప్రజలకు దూరం కాలేదు చింతమనేని. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నాంటూ ధైర్యం ఇస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని తమకు ఇబ్బందిగా మారారని భావించిన అధికార పార్టీ ఆయనను టార్గెట్ చేసిందని చెబుతారు. అందుకే ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు చింతమనేని. అయినా తన తీరు మాత్రం మార్చుకోకుండా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
ఆదివారం మరోసారి చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. విశాఖ జిల్లా జీకే వీధి మండలం శ్రీదారాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో నర్సీపట్నం వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ప్రభాకర్, ఆయన అనుచరులు అనుమానాస్పదంగా తిరిగారంటూ విశాఖ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం భీమడోలు సర్కిల్ ఇన్స్స్ పెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి, విడిచిపెట్టారు. చింతమనేని అరెస్ట్ , తర్వాత ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.
విశాఖ జిల్లాలో తనను అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన ఘటనలు వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు చింతమనేని ప్రభాకర్. పోలీసులు తనను చంపేస్తారని అనుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం నుంచి తనను చింతపల్లికి తీసుకెళ్లారని తెలిపారు చింతమనేని. తనకు అదే చివరి క్షణం అని అనుకున్నానని... ఆ దట్టమైన అడవుల్లో తనను కాల్చేసి, నక్సలైట్లు కాల్చేశారని చెపుతారేమోనని భావించానని అన్నారు. రక్షకభటులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకభటులుగా మారారని మండిపడ్డారు. తనకు నక్సల్స్ తో ప్రమాదం ఉందని చెపుతున్నారని... కానీ, తనకు ప్రమాదం నక్సల్స్ తో లేదని, పోలీసులతోనే తనకు ప్రమాదమని అన్నారు. తన అరెస్ట్ వెనుక వైసీపీ కుట్ర ఉందని చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు.