తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేస్తారా? నైట్ కర్ఫ్యూనా?
posted on Jun 19, 2021 @ 9:31AM
తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ గడువు ఆదివారంతో ముగుస్తుంది. మరోవంక రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. క్రియాశీల కేసుల సఖ్య కూడా క్రమక్రమంగా దిగి వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివిటి 1.36 శాతానికి తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్’ మరికొంత కాలం పొడిగించాలా లేక సడలించాలా అనే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఈ అంశాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ అద్యక్షతన శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.
ఈ సమావేశంలో కరోనా పరిస్తితులను చర్చించి,, లాక్ డౌన్ అంక్షల సడలింపు పై నిర్ణయం తీసుకోవడంతో పాటుగా కల్తీ విత్తనాలు, ఏపీ ప్రాజెక్టులు, నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక, రాజకీయ ప్రాధాన్యతగల హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి మంత్రివర్గ సమావేశానికి ముందే, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో పరిస్థితిని సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గొన్నారు. కాగా, సినిమా హాల్స్, పబ్బులు, బార్లు, కల్బ్బులు, వంటి వాటి మూసివేతను కొనసాగిస్తూ, ఇతర కార్యకలాపాలపై ఆంక్షలను పూర్తిగా లేదా సాధ్యమైన మేరకు ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సంబందిత శాఖలు నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని అధికార వర్గాల సమాచారం. కరోనా రెండవ దశ కేసుల వివరాలతో పాటుగా మూడవ దశకు సంబదించి అందుబాటులో ఉన్న అధికారిక సమాచారాన్ని మంత్రి వర్గం ముందుంచాలని, ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.
కరోనా సెకండ్ వేవ్ శాంతించిన, థర్డ్ వేవ్ విషయంలో వినవస్తున్న సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనాయని, కోర్టులు సైతం అక్షింతలు వేసిన నేపధ్యంలో, థర్డ్ వేవ్ విషయంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కునేందుకు మౌలిక సదుపాయాలు, వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నియామకాలు, మొబిలిటీ వంటి వివిధ విషయాలను చర్చించి, తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రి హరీష్ రావు సారధ్యంలో ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.
థర్డ్ వేవ్ విషయంలో పనిగట్టుకుని భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కూడా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం దృష్టిని కేంద్రీకరించింది. అదే సమయంలో మూడో వేవ్ ‘కు సంబంధించి ప్రజలకు మరింత అవగాహన కలిపించేందుకు ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రచార కార్యక్రమాలను సిద్డంచేస్తునట్లు అధికార వర్గాల సమాచారం. అయితే, కరోనా మహామ్మారిపై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు టీకా వేసుకోవడంతో పాటుగా ఇతరులకు ముఖ్య్మగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహచరులు, సిబ్బంది, ఇంటి పనివారు, ఇలా ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేందుకు సహకరించాలని, కోరుతున్నారు. అదే విధంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, అనవసరంగా బయటకు రాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు.