పెళ్లి పీటల మీది నుండి వధువు పరార్..
posted on Jun 19, 2021 @ 9:51AM
ఓపెన్ చేస్తే పెళ్లి సందడి జరుగుతుంది. పెళ్లి వాళ్ళు బంధువులను ఆహ్వానిస్తున్నారు. ఒక వైపు బాజాభజంత్రీలు మోగుతున్నాయి. మరో వైపు బాహ్మణుడు వేద మంత్రాలు వల్లిస్తున్నాడు. చిన్న పెద్ద అంతా పెళ్లి వేడుక తిలకిస్తున్నారు. పంచభూతాల సాక్షిగా ఆ ఇద్దరు ఒక్కడి అవుతున్న సమయాన ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తల్లి దండ్రులకు తెలిస్తే ప్రేమించిన వాడి దగ్గరికి వాళ్లమని తెలుగు సినిమా క్లైమాక్స్ లో చెప్పగానే హీరోయిన్ పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు.. ఎవరో ఒకరు వచ్చి ఓ వధువు చెవిలో ఏదో చెప్పగానే ఆ వధువు పెళ్లి మధ్యలోనే పీటల మీద నుంచి లేచి పరుగు అందుకుంది. పెళ్లి కూతురు అలా పరుగెత్తడం చూసి అందరు షాక్ అయ్యారు. ఆ పెళ్లి కూతురి గురించి ఒకొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతుందని. కట్ చేస్తే మళ్ళీ కొన్ని గంటల తర్వాత అదే జనం మళ్ళీ షాక్ అయ్యారు.. ఇంత సేపు ఎక్కడిపోయిందని. ఆ అమ్మాయి పెళ్లి పీటల మీది నుండి వెళ్లి పోవడానికి బలమైన కారణమే ఉంది. ఇంతకీ ఆ కారణం ఏందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఆలస్యమెందుకు పదండి ముందుకు..
పెళ్లి మండపంలో కూర్చున్న వధువు చేవిలో ఆమె బంధువులు ఓ ముఖ్యమైన విషయం చెప్పారు. ఆ మాట వినగానే వధువు ఆనందానికి అవధుల్లేవు. పెళ్లి జరుగుతుండగానే పీటల మీద నుంచి లేచి ఎకాఎకిన పరుగులు పెట్టింది. అదేంటీ.. వధువు అలా వెళ్లిపోతోందని అతిథులు ఆశ్చర్యపోయారు. అయితే, బంధువులు అసలు విషయం చెప్పగానే.. అతిథులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేంటీ.. పెళ్లి కూతురు అలా వెళ్లిపోతుంటే అంతా సంతోషం వ్యక్తం చేయడం ఏమిటని మీరు కూడా షాకవుతున్నారా? అయితే, ఆలస్యం చేయకుండా మేటర్‌లోకి వెళ్లిపోదాం.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని మిలాక్ బ్లాక్‌లోని ముహమ్మద్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఇక్కడ పంచాయతీ (బీడీసీ) ఎన్నికలు జరిగాయి. ఇందులో జదీద్ గ్రామానికి చెందిన పూనమ్ శర్మ కూడా పోటీ చేసింది. 135 వార్డు నుంచి ఆమె బరిలోకి దిగింది. ఆమె పెళ్లి రోజునే ఓట్ల లెక్కింపు కూడా జరిగింది.పూనమ్ శర్మ ఈ సందర్భంగా ఫలితాలు హోరాహోరీగా ఉన్నట్లు బంధువులు చెప్పడంతో.. పెళ్లి మధ్యలోనే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంది. ఎట్టకేలకు ఆమె తన ప్రత్యర్థి మీద 31 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరంగా ఊరేగింపు మధ్య పెళ్లి మండపానికి చేరుకుని వరుడితో తాళి కట్టించుకుంది.