తెలంగాణ స్థానిక ఎన్నికలు.. చేతులెత్తేసిన పార్టీలు
posted on Oct 1, 2025 @ 3:54PM
రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించవలసి వుంది. దీంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లపై జీవో జారీ చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి మార్గం సుగమం చేసింది. అంతే వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అయితే ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రధాన పార్టీలేవీ రెడీగా లేవు. వైపు ఓటమి భయం అన్ని పార్టీలలోనూ సమానంగా వ్యక్తం అవుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోన ఫలితాలు ప్రతికూలంగా వస్తే.. అన్న ఆందోళన కనిపిస్తున్నది. ఈ దశలో బీజేపీ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అసలు స్థానిక ఎన్నికలు జరిగే అవకాశమే లేదంటూ కుండబద్దలు కొట్టేశారు. అనవసరంగా భారీ ఆర్భాటంతో ప్రచారాలు చేయవద్దనీ, దావతుల పేరుతో డబ్బులు వృధా చేసుకోవద్దనీ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిజానికి స్థానిక సమరంలో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందన్న అంచనాలు బలంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలూ కూడా ఎన్నికల సన్నాహకాల విషయంలో ఇంకా తొలి అడుగులోనే ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల జీవో తో రేవంత్ సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నా.. ఆ నిర్ణయం కాంగ్రెస్ గ్రాఫ్ ను ఏ మాత్రం పెంచిందంటే.. ఆ పార్టీ నాయకులే అనుమానం అంటూ నసుగుతున్నారు. అధికారంలో ఉండి స్థానిక ఎన్నికలలో సత్తా చాటలేకపోతే ఆబోరు దక్కదన్న భయం కాంగ్రెస్ లో వ్యక్తం అవుతుంటే.. బీఆర్ఎస్ లో స్థానిక ఓటమి పార్టీ ఉనికికే ముప్పు తెస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.
ఇక్కడ మరో ప్రధాన అంశమేంటంటే.. బీజేపీ 42శాతం రిజర్వేషన్లను బాహాటంగా వ్యతిరేకించే పరిస్థితుల్లో లేదు. అయినా ఈటల మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏదోలా ఎన్నికలు జరిగినా.. తరువాత ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే జరిగిన ఎన్నికలను రద్దు చేసే అవకాశాలున్నాయని ఈటల చెబుతున్నారు. తద్వారా ఈటల హేతురహితంగా ఎన్నికల రద్దు ప్రస్తావన తేలేదనీ, గతంలో మహారాష్ట్రంలో ఇలాగే జరిగిందనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మహారాష్ట్ర కూడా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించింది. అయితే ఆ తరువాత ఆ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని బొంబై హైకోర్టు రద్దు చేసింది.
ఈ విషయాన్ని కూడా ఈటల ఉదహరించారు. ఆ ఉదాహరణ చూపుతోనే.. ఎన్నికలకు ప్రచారార్భాటాలు, దావత్ లతో సొమ్ము వృధా చేసుకోవద్దన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమేంటంటే స్వయంగా బీసీ నాయకుడై ఉండీ ఈటల కాంగ్రెస్ ప్రభుత్వ రిజర్వేషన్ల జీవోను వ్యతిరేకించడం. దీనినే ఎత్తి చూపుతూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నా.. ఎన్నికల విజయంపై మాత్రం ఆ పార్టీలో ధీమా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అందుకే షెడ్యూల్ విడుదలైనా ఎన్నికల హడావుడి మాత్రం పార్టీలలో పెద్దగా కనిపించడం లేదు.