స్ధానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ కు రిజర్వేషన్ల సవాల్!
posted on Sep 30, 2025 @ 10:21AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే.. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 5 వేల 749 ఎంపీటీసీ స్థానాలు, 565 జడ్పీటీసీ స్థానాలకు.. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇక.. 12 వేల 733 గ్రామ పంచాయతీలకు.. 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
అక్టోబర్ 9న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 11న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 13న రెండో దశఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. రెండో దశ నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 15ని చివరి తేదీగా నిర్ణయించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు.. అక్టోబర్ 23న తొలిదశ , అక్టోబర్ 27న రెండో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. అక్టోబర్ 31న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, నవంబర్ 4న రెండో దశ, నవంబర్ 8న మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం లక్షా 12 వేల 474 పోలింగ్ స్టేషన్లలో.. పోలింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. కోటీ 67 లక్షల మందికి పైగా ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో.. 85 లక్షల 36 వేల మందికి పైగా మహిళా ఓటర్లు, 81 లక్షల 65 వేల మందికి పైగా పురుష ఓటర్లు ఉన్నారు. కోర్టు ఆదేశాలతో.. 14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలకు ఎన్నికలను నిలుపుదల చేసింది ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో.. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఇప్పటికే.. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ జీవో జారీ చేసింది. ఈ మేరకు.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే.. అక్టోబర్ 9న తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అయితే.. దానికంటే ఒక్క రోజు ముందే.. 42 శాతం రిజర్వేషన్ల అమలుపై.. హైకోర్టు ఏం చెబుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కోర్టు నుంచి సానుకూలమైన ఆదేశాలు గనక వస్తే.. బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే చర్చ జరుగుతోంది. ఇది.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర మేలు చేస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం బహుశా ఇదే తొలిసారి. ఇప్పటికే దీనిపై జనంలో చర్చ మొదలైంది. దాంతో.. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు కైవలం చేసుకుంటుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.