హామీలతోనే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుందేమో?
posted on Jan 10, 2015 @ 10:11AM
ఆంధ్రాపాలకుల చేతిలో తెలంగాణా ప్రజలు దోపిడీకి గురయ్యారని కనుక ‘తెలంగాణా ప్రజల స్వంత పార్టీ’ అయిన తెరాసకు అధికారం కట్టబెడితే తాను వారి జీవితాలు మార్చేస్తానని కేసీఆర్ ఎన్నికల సమయంలో పదేపదే చెప్పేవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘అది చేస్తాము, ఇది చేస్తాము’ అంటూ అనేక హామీలను కూడా ఆయన గుప్పించారు. ఆయన వల్లనే తెలంగాణా సాధ్యమయింది కనుక, ఆయనే తమ జీవితాలలో కూడా వెలుగులు నింపుతారనే నమ్మకంతో ప్రజలు తెరాసకు అధికారం కట్టబెట్టారు. కెసిఆర్ అధికారంలోకి రాక ముందు ఎన్ని హామీలు గుప్పించారో తెలంగాణా ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా మరన్ని గుప్పించారు. ఇంకా గుప్పిస్తూనే ఉన్నారు. కానీ వాటన్నిటికీ ఆయన నిధులు ఎక్కడ నుండి తీసుకువస్తారో, వాటిలో ఎన్నిటిని ఎప్పటికి అమలు చేస్తారో? అసలు వాటన్నిటినీ అమలు చేసే ఉద్దేశ్యం ఉందో లేదో? ఉంటే చేయగలరో లేదో?అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి. ఎందువలన అంటే వారెవరూ ఆయనని హుస్సేన్ సాగర్ చుట్టూ వంద అంతస్తుల భవనాలను కట్టమని అడగలేదు...సినిమా సిటీలు, స్పోర్ట్స్ సిటీలు కట్టమని అడుగలేదు. కేవలం తమ జీవన ప్రమాణాలు మెరుగుపరిస్తే చాలని ఆశించారు. కానీ ఆ ఒక్క పనీ తప్ప కేసీఆర్ ప్రభుత్వం మిగిలిన అన్ని పనులు చేస్తానని హామీ ఇస్తోంది.
మా విద్యార్ధులకు మేమే స్కాలర్ షిప్పులు ఇచ్చుకొంటామంటూ ఆయన చాలా హడావుడిగా ‘ఫాస్ట్’ పధకం ప్రవేశపెట్టారు. కానీ కోర్టులు మొట్టికాయలు వేయడంతో దానిపై ముందుకు వెళ్ళలేక, వెనక్కి తగ్గితే పరువుపోతుందనే భయంతో నిలిచిపోవడంతో విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి ఫీజు రీ ఇంబర్స్ మెంటు కోసం ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఆంద్ర పాలకులు తెలంగాణా విద్యార్ధులపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని విమర్శలు గుప్పించిన కేసీఆర్ కూడా ఇప్పుడు అదే పని చేస్తుండటం వారికి విస్మయం కలిగిస్తోంది.
ఇంతకు ముందు ఆంధ్రా ప్రభుత్వాలు వృద్ధులు, వికలాంగులకు కేవలం రెండు వందలు మాత్రమే పెన్షన్లు ఇస్తే తమ ప్రభుత్వం ఏకంగా దానికి ఐదు రెట్లు చేసి వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తోందని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్ ప్రభుత్వం, అది చాలా భారంగా మారడంతో అనేక వేలమందిని అనర్హులుగా చూపుతూ కోత విధించడంతో వారందరూ కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అది గమనించిన కేసీఆర్ ప్రభుత్వం అతి తెలివి ప్రదర్శిస్తూ ఆ నెపాన్ని అధికారుల మీదకు నెట్టి వేసింది. తమ ప్రభుత్వం అర్హులయిన ప్రతీ వ్యక్తికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రజల ముందు వారిపై చిందులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, అందుకోసం జిల్లాలకు కేటాయించిన బడ్జెట్ ప్రకారమే పెన్షన్లు ఇవ్వవలసివస్తున్నందున ఈ సమస్య తలెత్తుతోందని అధికారుల వాదన. అందువలన ఈ విషయంలో కూడా ప్రభుత్వాన్నే తప్పుపట్టవలసి ఉంటుంది.
ఇక పంట రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు నివారణకు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొందో తెలియదు, కానీ నేటికీ ఆ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి ప్రాధమిక సమస్యలన్నిటినీ పరిష్కరించకుండా కేసీఆర్ రోజుకో కొత్త ప్రాజెక్టు చొప్పున ప్రకటిస్తూ గాలిలో మేడలు కడుతూ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నారు.
మన దేశంలో అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ అయినా ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేనప్పుడు, ప్రజలను మరిపించేందుకు వాటి స్థానంలో సరికొత్త హామీలు ఇవ్వడమనే ఆనవాయితీని చాలా కాలంగా పాటిస్తున్నాయి. బహుశః కేసీఆర్ కూడా ఆ అనవాయితీనే తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుంది. కనుక మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో ఆయన మరిన్ని కొత్త హామీలు గుప్పించవచ్చునేమో?