నాయకుడంటే అలాగుండాలి మరి
posted on Jan 9, 2015 @ 9:51AM
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన పార్టీ, కేంద్రప్రభుత్వం, తెరాస ప్రభుత్వం గురించి నిన్న హైదరాబాద్ లో చెప్పిన విషయాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. గత ఏడూ నెలల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ చేప్పట్టిన అనేక పాలనాపరమయిన సంస్కరణల గురించి వివరించి, నిర్ణయాలు తీసుకోవడంలో తమ ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కళ్ళకు కట్టినట్లు వివరించారు.
దేశం సర్వతో ముఖాభివృద్ధి కోసం మూస పద్ధతులకు స్వస్తి చెపుతూ ‘నీతి ఆయోగ్’ (మోడీ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ప్రణాళికా సంఘం) ఏర్పాటు చేసి దానిలో దేశంలో అన్ని రాష్ట్రాలను కూడా భాగస్వాములుగా చేయడం ద్వారా రాష్ట్రాలకు సముచిత గౌరవం ఇస్తూ వాటి అవసరాలను తీర్చాలనే తమ ప్రభుత్వం విధానం గురించి చక్కగా వివరించారు. మోడీ ప్రభుత్వం చేపడుతున్న పలు సంస్కరణలు, చర్యల వలన దేశంలో క్రమంగా ద్రవ్యోల్భణం తగ్గుముఖం పడుతూ అన్ని వస్తువుల ధరలు తగ్గుతున్న విషయాన్ని ఆయన ప్రజలకు గుర్తు చేసారు. దేశంలో కనబడుతున్న ఈ మార్పుల కారణంగా ప్రపంచ దేశాలు కూడా భారత్ పట్ల ఇప్పుడు మరింత గౌరవం ప్రదర్శిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఆయన చెప్పిన ఈ విషయాలన్నీ కంటికి ఎదురుగా కనబడుతున్నవే. కానీ ఆంధ్రా, తెలంగాణాకు చెందిన ఆ పార్టీ నేతలు ఈ విషయాలన్నీ చెప్పుకోవాలని తెలియకనో లేక నిర్లక్ష్యం చేతనో చెప్పుకోకుండా ఊరుకొన్నారు. కానీ అమిత్ షా చెపుతున్న ఈ మాటలు విన్న తరువాత మోడీ ఏరికోరి ఆయనకే పార్టీ అధ్యక్షపదవి ఎందుకు కట్టబెట్టారో అర్ధం అవుతోంది. ఆయన అనేక రాష్ట్రాలలో తమ పార్టీకి ఏవిధంగా ఘనవిజయాలు సాధించిపెడుతున్నారో కూడా అర్ధం అవుటోంది. పార్టీని నడిపించే నాయకుడికి ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఉండాలో ఆయన తన మాటల ద్వారా చాటిచెప్పారు.
అటువంటి నాయకత్వ లక్షణాలు, విభిన్నంగా ఆలోచించగల శక్తి, వ్యూహా రచన సామర్ధ్యం అందరికీ ఉండకపోవచ్చును. కానీ ఉభయ రాష్ట్రాలలో ఆ పార్టీ నేతలు ఆయన చూపిన ఈ మార్గాన్ని అనుసరిస్తే వారు తమ పార్టీని బలోపేతం చేసుకోవచ్చును. తెలంగాణాలో తమ పార్టీకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర నేతల అసమర్ధత కారణంగా ఒక చక్కటి అవకాశాన్ని పోగొట్టుకొన్నామని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణాలో తెరాసకు బలమయిన పార్టీ పునాదులు లేకపోయినప్పటికీ, తెలివిగా ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకొని ఒకరిద్దరు వ్యక్తుల స్వీయ బలం కారణంగానే అధికారంలోకి రాగలిగిందని, కానీ తమ పార్టీకి బలమయిన పునాది ఉండి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినప్పటికీ విజయం సాధించలేకపోయిందని ఆయన అన్నారు. అంటే తమ నాయకుల అసమర్ధత కారణంగానే తమ ఓడిపోయిందని చెప్పినట్లే భావించవచ్చును.
తెదేపా ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొంటూ ఐ ప్యాడ్ లు, ట్యాబ్లేట్ పీసీలను ఉపయోగిస్తూ రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసింది. అదంతా బీజేపీ నేతలు కూడా చూసినప్పటికీ, వారు నేటికీ రసీదు పుస్తకాలతో సభ్యత్వ నమోదు చేయడాన్ని కూడా ఆయన కూడా తప్పు పట్టారు. మొబైల్ ఫోన్ లేదా ఆన్ లైన్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ చేప్పట్టాలని ఆయన సూచించారు. ఈ ఐదేళ్ళలో బీజేపీ గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకొన్నట్లయితే తెరాసను ఓడించడం పెద్ద కష్టమయిన పనికాదని ఆయన అన్నారు.
ఆయన తెరాస-బీజేపీ బలబలాలు, తమ పార్టీ అనుసరించాల్సిన విధానాల గురించి చేసిన సూచనలు, విశ్లేషణ చాలా ఆలోచించదగ్గవే. ఒకవేళ రెండు రాష్ట్రాలలో బీజేపీని బలపరుచుకోవాలనే ఆలోచన, తపన ఆ పార్టీ నేతలకు ఉన్నట్లయితే అమిత్ షాను ఆదర్శంగా తీసుకొని ఆయన సూచిస్తున్న పద్దతులలో ముందుకు సాగడం మంచిది.