రాజకీయ పార్టీకి నిర్దిష్ట లక్ష్యాలు ఉండాలి మరి!
posted on Jan 12, 2015 @ 12:07PM
ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో వచ్చే ఎన్నికల నాటికి ఒంటరిగా పోటీ చేసే స్థాయికి ఎదగాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రెండు రాష్ట్రాలలో తన పార్టీ నేతలకు గట్టిగా చెప్పి వెళ్ళారు. తెలంగాణాలో గ్రామ స్థాయి నుండి పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకోవడం ద్వారా, ఆంధ్రాలో పార్టీ క్యాడర్ బలోపేతం చేసుకొంటూనే కనీసం 70మంది సమర్దులయిన నేతలను ఏర్పాటుచేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికలకి సిద్దం కావాలని ఆయన మార్గ నిర్దేశనం చేసారు.
ఆ సందర్భంగా తెరాస పార్టీ కేవలం ఒక వ్యక్తి (కేసీఆర్) బలం మీద, తెలంగాణా సెంటిమెంటు మీదనే ఆధారపడి నిలబడి ఉందని, అటువంటి పార్టీని బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పిన మాటలు బీజేపీ రాష్ట్ర నేతలలో ఆత్మవిశ్వాసం నింపగలిగాయో లేదో తెలియదు గానీ ఆ మాటలు సూటిగా కేసీఆర్ గుండెల్లో బాకుల్లా గుచ్చుకొన్నాయి. అందుకే మా పార్టీకి బలం లేదని చెపుతున్న బీజేపీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండబోవని శాపనార్ధాలు పెట్టారు. అయితే ఉన్న మాట అంటే ఉలుకెక్కువన్నట్లుంది కేసీఆర్ స్పందన.
రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్ట లక్ష్యం, పటిష్టమయిన పునాదులు ఉండాలని అమిత్ షా చెప్పిన మాటలు ఏ పార్టీకయినా ఆచరనీయమే. కానీ తెరాస పార్టీ మొదటి నుండి కూడా కేసీఆర్ బలంపై, తెలంగాణా సెంటిమెంటు, ఆంద్ర విద్వేషంపైనే ప్రధానంగా ఆధారపడి మనుగడ సాగిస్తోంది తప్ప ఆ పార్టీకున్న బలం వల్ల కాదని అందరికీ తెలుసు. అయితే కేసీఆర్ కి ఈవిషయం తెలియదని భావించలేము. కానీ నేటికీ ఆయన తన పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకొనే ప్రయత్నం చేసుకోవడం కంటే ఇతరపార్టీల నేతలను తన పార్టీలోకి ఆకర్షించి రాష్ట్రంలో ఆయా పార్టీలను బలహీనం చేయడం ద్వారా తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ నేటికీ కూడా తన ఉనికిని కాపాడుగలుగుతోందంటే అందుకు ప్రధాన కారణం ఆ పార్టీకి గ్రామ స్థాయినుండి బలమయిన క్యాడర్ ఉండటమే. ఆంధ్రాలో ఆ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. రాష్ట్రంలో ఇంకా బలపడేందుకు సభ్యత్వ నమోదు ప్రక్రియను ఒక ఉద్యమంలా నిర్వహించి రెండు రాష్ట్రాలలో కలిపి ఏకంగా అరకోటి మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్చుకోగలిగింది. జాతీయ స్థాయిలో బీజేపీని విజయపధంలో నడిపిస్తున్న అమిత్ షా విజయరహస్యం కూడా అదే! అందుకే 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణాలో గ్రామ స్థాయి ఉండి పార్టీని బలోపేతం చేసుకోమని ఆయన తన నేతలకు చాలా చక్కటి మార్గదర్శనం చేసారు. దానిని వారు గ్రహిస్తారా లేదా? అనేది వేరే విషయం. కానీ ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడయిన కేసీఆర్ కూడా అమిత్ షా చెప్పిన అతిముఖ్యమయిన ‘ఆ పాయింట్’ ని గ్రహించకుండా బీజేపీకి శాపనార్ధాలు పెట్టడం విచిత్రం.
ఒకవేళ తెరాస, బీజేపీ, వైకాపా,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికలలో గెలవాలని గట్టిగా కోరుకొంటున్నట్లయితే ఇప్పటి నుండే అన్ని పార్టీలు గ్రామ స్థాయి నుండి తమ పార్టీలను నిర్మించుకోవలసి ఉంటుంది. అలా కాదని కేవలం అధికార పార్టీ లోపాలను ఎండగడుతూ, ఆత్మవంచన చేసుకొంటూ కాలక్షేపం చేసినట్లయితే వారి అంచనాలు తారుమారవడం తధ్యం.
అమిత్ షా సూచించిన విధంగా 70 మంది నాయకులను తయారు చేసుకొనే ప్రయత్నంలోనే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఏకైక చిరపరిచిత మొహంగా కనిపిస్తున్న యంపీ చిరంజీవిని ‘తెలుగు సినీ పరిశ్రమకు మూడో కన్ను వంటివాడు’ అని ఊదరగొట్టారేమో?