బకాయిల దెబ్బ.. సచివాలయాల నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు
posted on Dec 30, 2019 @ 5:23PM
గ్రామ సచివాలయం భవనాల నిర్మాణాల పై పీటముడి పడింది. గ్రామాల్లో నిర్మాణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నా ఇప్పటికే బిల్లుల బకాయిలు రూ.2000 కోట్లకు చేరడంతో కాంట్రాక్టర్లలో ఆసక్తి కొరవడింది. రాష్ట్రంలో మొత్తం 1365 గ్రామ పంచాయతీల్లో 11,158 గ్రామ సచివాలయాలుగా మార్చి ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు ప్రభుత్వం సిబ్బందిని నియమించింది. 7,785 సచివాలయాలకు సొంత భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 5,248 భవనాలు విస్తరించాల్సి ఉంది.1771 యొక్క సచివాలయలు ఇతర ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తూ ఉండగా మరో ఒక 1,602 అద్దె భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.
సచివాలయాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు గ్రామాల్లో లేకపోవటంతో ఉపాధి పథకం నిధుల ద్వారా నూతన భవన నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో వివిధ పనులు చేపట్టిన మాజీ సర్పంచులు, చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఉపాధి బిల్లుల బకాయిలు చెల్లించకపోవటంతో ప్రస్తుతం పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.ఇప్పటికే గ్రామాల్లో 2 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నుంచి మెటీరియల్ నిధులు విడుదల కాకపోతే పరిస్థితి ఏంటని పలువురు ఈ పనులకు వెనుకాడుతున్నారు. ఉపాధి పథకం నిబంధనల ప్రకారం గ్రామాల్లో టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ విధానం లోనే ఈ పనులు అప్పగించాలి. ప్రస్తుతం సర్పంచులు లేనందున గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి ద్వారా వీటిని అప్పగిస్తారు. భవన నిర్మాణాల్లో పెద్దగా ఆదాయం ఉండదని కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని అంచనా. టెండర్ల పనుల్లో కాంట్రాక్టర్ బెనిఫిట్ కింద 14% శాతం కేటాయిస్తారు. ఉపాధి పనులు నామినేషన్ విధానంలో చేస్తున్నందున అవి వచ్చే అవకాశం లేదు. పైగా నిధుల కొరత ఉండటంతో ఈ పనులు చేయటానికి ఎవరూ మొగ్గు చూపటం లేదని సమాచారం.ఎవరైనా తమంత తాముగా ఆసక్తి తో ముందుకొస్తే తప్ప నిర్మాణా లు చేపట్టడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు.
సచివాలయ పాలన పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే కొత్తగా 4181 భవనాలు నిర్మించాల్సిన అవసరముందని గుర్తించారు. 3189 భవనాల నిర్మాణానికి గ్రామాల్లో స్థలం అందుబాటులో ఉందని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. మరో 992 గ్రామ సచివాలయాలకు వేరే స్థలం లేదు. ఒకేసారి ఇన్నిటిని నిర్మించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ప్రభుత్వం విడతల వారీగా నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా ఉపాధి పథకంలో 3494 భవనాల నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేశారు.973 కోట్లతో 2781 భవనాల్లో కలెక్టర్లు మంజూరు చేశారు.ముందుగా అద్దె భవనాల్లో ఉన్న సచివాలయాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని నిర్మించాలని నిర్ణయించారు అధికారులు.20 ఏళ్లకు ముందు నిర్మించి కూలిపోయే స్థితిలో ఉన్నవి ప్రస్తుత అవసరాలకు సరిపోయినంత స్థలం లేని వాటి విస్తరణను రెండో ప్రాధాన్యంగా తీసుకొని పనులను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది .గత ఐదేళ్లలో ఉపాధి పథకం ద్వారా భారీ సంఖ్యలో పంచాయతీ భవనాలు నిర్మించారు. వాటిని 860 చదరపు అడుగుల నుంచి 1360 చదరపు అడుగులకు విస్తరించేందుకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు భావిస్తున్నారు.