ఉండాలా వెళ్లాలా.. అయోమయంలో కాంగ్రెస్ సీనియర్లు
posted on Dec 26, 2022 @ 10:10AM
కాంగ్రెస్ లో సంక్షోభానికి కారణమైన సీనియర్ల పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది. సంక్షోభ పరిష్కారానికి కేంద్రం దూతగా వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. ఒక్కొక్కరితో విడివిడిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై సీనియర్లు చేసిన ఫిర్యాదులను సావధానంగా విన్నారు. అంతే. ఆ తరువాత ఆయన వారికేమీ చెప్పలేదు. సరికదా.. ఏవైనా ఇబ్బందులు ఉంటే హైకమాండ్ కు విన్నవించుకోవాలి తప్ప మీడియా ముందు మాట్లాడటం తగదంటూ ఓ జనరల్ సూచన చేసి చక్కాపోయారు.
అయితే సీనియర్ల కు ఆ సూచన ఒక వార్నింగేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక పరాజయం బాధ్యత పూర్తిగా రేవంత్ పై పడుతుందన్న భావనలో ఉన్న సీనియర్లకు డిగ్గీ రాజా మాటలు మింగుడు పడటం లేదు. ఆయన వచ్చి వెళ్లిన తరువాత కూడా పరిస్థితి ఆయన రాక ముందు ఎలా ఉందో అలాగే ఉంది. అదనంగా తమ ఫిర్యాదులపై డిగ్గీ రాజీ స్పందించకపోవడంతో సీనియర్లు గతం కంటే బలహీనపడ్డారన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది.
దీంతో ఇక ఇప్పుడు ఏం చేయాలన్న గందరగోళంలో సీనియర్లు పడ్డారు. డిగ్గీ రాజా వచ్చి వెళ్లిన తరువాత కాంగ్రెస్ నేతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక పార్టీలోనే కొనసాగుతూ అసమ్మతి కార్యకలాపాలు కొనసాగించే అవకాశం వారికి లేకుండా పోయింది. డిగ్గీ రాజా హస్తినకు వెళ్లిన తరువాత ఆయన మళ్లీ ఎప్పుడొస్తారు.. తమ అసమ్మతిని ఆయనకు ఎప్పుడు తెలియజేయాలి అని ఎదురు చూడాలే తప్ప గతంలోలా ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ పై ఇష్టారీతిగా విమర్శలు చేసి, అసమ్మతి రాగం అంటూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
డిగ్గీ రాజా సూచనతో వారికి ఏమైనా ఇష్యూలు ఉంటే హైకమాండ్ ఎదుటకు తీసుకు వెళ్లాలి తప్ప గతంలోలా మీడియా మీట్ పెట్టి నిప్పులు చెరిగేసి, విమర్శలు గుప్పించాలంటే కుదిరే పరిస్థితి లేదు. క్రమశిక్షణ చర్యల కత్తి వారి మెడమీద వేళాడుతోంది. అంటే ఇకపై పార్టీలో ఉండాలంటే రేవంత్ నిర్ణయాలకు వంత పాడాల్సిందే. అలా పాడలేని వారుంటే మర్యాదగా పార్టీని వీడి వెళ్లాలి. ఇదీ డిగ్గీ రాజా సూచన సారాంశం.
ఇప్పుడు ఆ సూచనే కాంగ్రెస్ సీనియర్లను అయోమయంలో పడేసింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు టీపీసీసీ చీఫ్ ను కానీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ ను కానీ మార్చే అవకాశాలు లేవని డిగ్గీ రాజా చెప్పకనే చెప్పేశారు. దీంతో దిగ్విజయ్ వచ్చి వెళ్లిన తర్వాత రేవంత్ వర్గం మరింత బలం పుంజుకుందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా గ్రూపులు కట్టిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు వెనక్కు తగ్గలేక, ముందుకు సాగలేక ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం బలోపేతం అయ్యింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇదంతా రేవంత్ టీపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత చోటు చేసుకున్న పరిణమామమే. దానికి తోడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణను తీసుకువచ్చిన ఘనతను కూడా కేసీఆర్ వదులుకున్నారు.
దీంతో ఇప్పడు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలకు గట్టిగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ కు లభించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్లు ఇంత కాలం పార్టీని అంటిపెట్టుకుని ఉండి, తీరా ఫలాలు ( అధికారం) దుక్కుతాయన్న అవకాశాలు ఉన్న సమయంలో పార్టీని వీడటం తొందరపాటు అవుతుందా అన్న సంశయం వెన్నాడుతోంది. అలా కాదని పార్టీనే అంటిపెట్టుకుని ఉంటే ఇంత కాలం తాము వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఏం చెబితే అది చేయాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు అయోమయంలో పడ్డారు.