సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా కేసీఆర్ కేబినెట్ విస్తరణ
posted on Dec 26, 2022 @ 9:39AM
తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారా? తన క్యాబినెట్ లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాద లోగా జగరనున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కేదెవరికి? ఉద్వాసనకు గురయ్యేదెవరు అన్న చర్చ బీఆర్ఎస్ వర్గాలలో జోరుగా సాగుతోంది.
కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశంఉందంటున్నారు. అలాగే ప్రస్తుత కేబినెట్ లో ముగ్గురికి ఉద్వాసన అనివార్యమని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఈటల రాజీనామాతో ఆరోగ్య శాఖ ఖాళీగా ఉండగా తాత్కాలికంగా హరీష్ రావుకు ఆ శాఖను అప్పగించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు ఆదనంగా ఆరోగ్య శాఖ అప్పగించడంతో ఆయనపై పని ఒత్తిడి అధికంగాఉంది. దీంతో హరీష్ రావును ఆరోగ్య శాఖ బాధ్యతల నుంచి తప్పించి ఆ శాఖను బీసీ నేతకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
అలాగే విస్తరణలో మరో ఇద్దరు బీసీలు, ఎస్సీలకు అవకాశం కల్పించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అలాగే తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న మంత్రి మల్లారెడ్డిపై ఈ సారి విస్తరణలో వేటు పడే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఇక కేబినెట్ విస్తరణలో బెర్త్ లు దక్కే అవకాశం ఉందంటూ కడియం శ్రీహరి, మధుసూదనాచారి, బాల్క సుమన్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే బండా ప్రకాష్ కూడా బెర్త్ లభించే అవకాశం ఉందంటున్నారు. సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా కేసీఆర్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.