రాహుల్ యాత్ర ఎఫెక్ట్.. కమలం పార్టీలో గుబులు
posted on Dec 26, 2022 @ 10:20AM
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అయితే ఈ యాత్రను సాధ్యమైనంతగా డౌన్ ప్లే చేయడానికి బీజేపీ చేయగలిగినంతా చేసింది. ఎవరికీ పట్టని యాత్రగా అభివర్ణించింది. యాత్ర సాగుతుండగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక, గుజరాత్, అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినా రాహుల్ గాంధీ వాటిని వేటినీ పట్టించుకోకుండా స్థిత ప్రజ్ణతతో యాత్రను కొనసాగిస్తున్నారు.
రాజకీయ యాత్ర కాదు.. విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, అసహనం దేశంలో పెచ్చరిల్లిపోతున్న సమయంలో ప్రేమ పంచేందుకూ, ప్రజలను ఏకం చేసేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానంటూ రాహుల్ జోడో యాత్ర మొదలు పెట్టడానికి ముందు చెప్పిన మాట నుంచి ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ జరగలేదు. రాజకీయాలు, ఎన్నికల ఫలితాలను గురించి ఇసుమంతైనా పట్టించుకోలేదు. ఆఖరికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడం తప్ప మరేం చేయలేదు. అయినా రాహుల గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ముఖ్యంగా రాజకీయాలతో సంభంధం లేకుండా యువతీ యువకులు, విద్యార్ధులు, చిన్నారులు, మహిళలు, రైతులు, కార్మికులు ఇలా అన్నివర్గాల ప్రజలు రాహుల్ గాంధీ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆటపాటలతో రాహుల్ జోరుగా హుషారుగా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మధ్య మద్యలో సినిమా స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ముఖ్యంగా సామాజిక మాధ్యమం అంతా రాహుల్ యాత్ర వెనుక ర్యాలీ చేస్తోంది. ఇంత ఉత్సాహంగా అంతులేని ఆదరణతో సాగుతున్న కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ కు ఏం ఒరిగింది అని ప్రశ్నించే వారికి నాగపూర్ స్థానిక ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి. భారతీయ జనతా పార్టీ కంచుకోట అయిన నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాగ్ పూర్ లోని 236 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 200 చోట్ల గెలుపొందింది. డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సొంత గ్రామం ఫెట్రీలో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. రాహుల్ జోడో యాత్ర కారణంగానే ఈ విజయం సిద్ధించింది. ఈ పరాజయానికి కారణాలు వెతుక్కునే పనిలో బీజేపీ ఉంటే పరిశీలకులు మాత్రం కరణాలు వెతుక్కోవలసిన అవసరం ఇసుమంతైనా లేదు.. అంతా రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావమే అంటున్నారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రజలతో మమేకమౌతున్న విధానం, హెల్త్ కాన్షస్ నెస్, నడవడిక, వ్యవహార శైలి వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా వ్యవహరిస్తున్న తీరు రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రభావమే నాగపూర్ ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలించిందంటున్నారు. బీజేపీ ఎంత కాదంటున్నా.. రాహుల్ యాత్ర ఆ పార్టీలో గుబులు రేపుతున్నది. ఇందుకు సాక్ష్యం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే కాంగ్రెస్ ను తేలిగ్గా తీసుకోవద్దని క్యాడర్ ను హెచ్చరించడమేనని పరిశీలకులు అంటున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ.. బీజేపీ క్యాడర్ ను కాంగ్రెస్ విషయంలో హెచ్చరించడమే రాహుల్ యాత్ర బీజేపీలో గుబులు రేపుతున్నదనడానికి నిదర్శనం.
అంతే కాదు కర్నాటక రాష్ట్రంలో రాహుల్ యాత్ర సాగుతున్న సమయంలో బీజేపీ సంకల్ప యాత్ర ప్రారంభించింది. కర్నాటక లోని బీజేపీ సర్కార్ రాహుల్ యాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించింది. తాజాగా కోవిడ్ ప్రొటోకాల్ ఆంక్షలు విధించింది. వీటిని వేటినీ పట్టించుకోకుండా రాహుల్ యాత్ర జనాదరణతో కొనసాగుతుండటం బీజేపీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ యాత్ర ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందన్నఆశా భావం హస్తంపార్టీలో వ్యక్తం అవుతుంటే.. అదే భావంతో బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది.