కేసీఆర్ కు ఘన సన్మానం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం
posted on May 18, 2021 @ 4:53PM
తెలంగాణలో ప్రస్తుతం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కొవిడ్ మరణాలను ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్షాల ఆరోపణలకు కౌంటరిస్తున్నారు గులాబీ నేతలు. కరోనా సమయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. అంతేకాదు ముఖ్యమంత్రికి ఘనంగా ప్రజా సన్మానం చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
సోమవారం కొవిడ్ కట్టడి చర్యలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఆరు మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో సంగారెడ్డి మొదటిగా ఉంది. దీంతో సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి కలుస్తానని, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటానని వివరించారు.
వైద్య కళాశాల కోసం తన పోరాటం ఇప్పటిది కాదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూడేళ్లుగా పోరాడుతున్నానని, తన కుమార్తెతో కలిసి అసెంబ్లీకి పాదయాత్ర కూడా చేశానని వెల్లడించారు. వైద్య కళాశాలకు సీఎం రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ రోజున కేసీఆర్ కు భారీ ఎత్తున సన్మానం చేస్తానని చెప్పారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని క్లారిటీ ఇచ్చారు జగ్గారెడ్డి.