సైకో మొగుడు.. ఇద్దరు పెళ్ళాలు బలి..
posted on May 18, 2021 @ 5:36PM
అది వరంగల్ రూరల్ జిల్లా. పర్వతగిరి మండలం. ఏనుగల్లు గ్రామానికి చెందిన కిరణ్ అల్లరిచిల్లరిగా ఉంటూ..బాధ్యత లేకుండా తిరుగుతుండేవాడు. కొడుకును ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పినా కిరణ్ పట్టించుకోకపోవడంతో తల్లి దండ్రులు అతని గాలికి వదిలేశారు. అతనిని వదిలేసి మహబూబాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పటి నుంచి ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇంకా అతని అల్లరికి అడ్డుఅదుపు లేకుండాపోయింది. కిందమీద పది 2013లో పద్మ అనే మహిళను ప్రేమించాడు. ఆమె కూడా కిరణ్‌ను ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లు బాగానే సాగిన.. ఆ ప్రేమ కాపురం రాను రాను వీరి కాపురంలో కొన్నాళ్లకు కలతలు వచ్చాయి. ఆ కలతల పేరే అనుమానం. తన భార్య పద్మ వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని కిరణ్ అనుమానపడ్డాడు. ఈ విషయంలో భార్యతో పలుమార్లు గొడవపడ్డాడు. తాను ఎవరితో ఎఫైర్ యవ్వారం పెట్టుకోలేదని ఆమె ఎంత చెప్పినా.. అతను వినిపించుకోలేదు. అతనెవరో చెప్పాలని భార్యను తిట్టికొట్టి వేధించసాగాడు. ఒకరోజు భార్యాభర్తల మధ్య ఇదే విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇక అప్పటికే అనుమానంతో ఉన్న కిరణ్ కి కోపం వచ్చింది. క్షణికావేశంలో పద్మను కిరణ్ హత్య చేశాడు. అనంతరం.. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు ఆ క్రూరుడు.. ఆ తర్వాత భయంతో ఊరొదిలి పారిపోయాడు. ఇదిలా ఉండగా..
కట్ చేస్తే.. 2019లో కిరణ్ కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన అంజలి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి వరకూ తీసుకెళ్లిన కిరణ్ ఆమెతో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. అంజలిని పెళ్లి చేసుకున్న కిరణ్ ఆమె ఇంట్లోనే మూడు నెలల పాటు ఉన్నాడు. అయితే.. భార్య ఏఎన్‌ఎం కావడంతో ఆమె పనిచేసే దగ్గర ఎవరితోనో ఎఫైర్ నడుపుతుందని కిరణ్ మళ్ళీ అనుమానపడ్డాడు. తను అత్తగారింట్లో ఉండకూడదని భావించి.. భార్యతో సహా ఏనుగల్లుకు వెళ్లి అక్కడ కాపురం పెట్టాడు. అయితే.. జులాయిగా తిరుగుతున్న కిరణ్ అప్పటి వరకు ఉన్న అలవాట్లు చాలక కొత్తగా అదనపు కట్నం కోసం అంజలిని వేధించసాగాడు. అత్తమామల పేర ఉన్న ఇంటిని అమ్మి డబ్బు తీసుకురావాలని భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు.. కిరణ్‌లో మరో సైకో కోణం కూడా ఉంది. భార్యను టార్చర్ చేస్తున్న సమయంలో ఫోన్‌లో వీడియోలు తీసి ఆ వీడియోలను తరువాత చూసి పైశాచిక ఆనందం పొందేవాడు.
మే 12న రాత్రి సమయంలో కిరణ్ అంజలితో అదనపు కట్నం విషయంలో గొడవపడ్డాడు. ఆమె అఫైర్ నడుపుతోందని భావించి నిలదీశాడు. అంజలి తాను ఏ తప్పు చేయలేదని చెప్పినా వినకుండా ఆమెపై కర్రతో దాడి చేశాడు. కిరణ్ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అంజలిని ఇరుగుపొరుగు వారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 14న చనిపోయింది. అంజలి హత్య కేసులో కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొదటి భార్యను కూడా హత్య చేసినట్లు బయటపడింది. ఇద్దరు భార్యలను హత్య చేసిన కేసులో కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.