కేటీఆర్ కు డాక్టర్ ట్వీట్.. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల స్టైఫండ్ హైక్
posted on May 18, 2021 @ 4:26PM
తెలంగాణలోని హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. హౌస్ సర్జన్, పీజీ వైద్యుల స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా, వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్టైఫండ్ హైక్ కోసం గతంలో చాలా సార్లు పోరాటం చేశారు హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు. వైద్యాధికారులు కూడా వారికి హామీ ఇచ్చారు. కాని అది నెరవెరలేదు. అయితే ఒక్క డాక్టర్ చేసిన ట్వీట్ తో వారి సమస్య పరిష్కారమైంది.
స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. సార్ కరోనా కష్టకాలంలో మీరు ఎందరికో సహాయం చేసుకున్నారు. కానీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో నిరంతరం సేవలందిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి తమకు జీతాలు అందడం లేదు. కొవిడ్ డ్యూటీలకు హాజరైన వారికి ఇతర రాష్‌ర్టాల్లో ప్రోత్సహకాలు ఇస్తున్నారు. అలాంటివి కూడా తమకు అందడం లేదు. తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఎలా వర్క్ చేయగలం సార్ ట్వీట్ చేశారు.
డాక్టర్ స్నేహ సోమారెడ్డి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాలని హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జీవో విడుదల అవుతుందని కేటీఆర్ రీట్వీట్ చేశారు. కేటీఆర్ చెప్పినట్లుగానే హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులకు రాష్ర్ట ప్రభుత్వం తీపి కబురు అందించింది. హౌస్ సర్జన్, పీజీ వైద్యులకు స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.