కేసీఆర్ తో రామోజీ రావు సమావేశం
posted on Dec 12, 2014 @ 6:48PM
ఈనాడు గ్రూప్ మరియు రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీ రావు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈరోజు తన రామోజీ ఫిలిం సిటీలో సమావేశమయ్యారు. ఆయన ఆహ్వానం మేరకు ఫిలిం సిటీకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి తేనీటి విందు ఇచ్చారు. ఫిలిం సిటీకి సంబంధించిన విశేషాలను, వివరాలను కేసీఆర్ ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నట్లు సమాచారం.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో నిరంతర యుద్ధం చేస్తున్న కేసీఆర్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న రామోజీ రావుతో సమావేశం అవడం చాలా ప్రాధాన్యం ఉన్నదేనని భావించవచ్చును. ఆయన ద్వారా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఏమయినా మార్గం వెదికే ప్రయత్నంలో కలిసారా? లేక త్వరలో తెలంగాణా చిత్ర సీమకు ప్రత్యేకంగా ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు కనుక ఆ విషయంలో రామోజీ రావు సలహాలు, సూచనలు తీసుకొనేందుకు ఆయనను కలిసారా? లేక మరేవయినా కారణాలున్నాయా అనేది వారిలో ఎవరో ఒకరు చెపితే తప్ప తెలిసే అవకాశం లేదు. కనుక ఫిలిం సిటీ నిర్మాణం కోసం ఆయన సలహా కోరి ఉండవచ్చని సరిపెట్టుకోవలసి ఉంటుంది.