పశ్చిమబెంగాల్ రవాణాశాఖ మంత్రిని అరెస్ట్ చేసిన సీబీఐ
posted on Dec 12, 2014 @ 6:12PM
పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్ రవాణా మరియు క్రీడా శాఖమంత్రి మదన్ మిత్రాను ఈరోజు సీబీఐ అరెస్ట్ చేసింది. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో వ్యవహారంలో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యంపీలు కునాల్ ఘోష్, శ్రీన్ జాయ్ బోస్ మరియు పార్టీ నేత రజత్ మజుందార్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పుడు అదే కేసులో మంత్రిని కూడా అరెస్ట్ చేసింది. ఆయనతో బాటు ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయిన శారదా చిట్ ఫండ్స్ సంస్థ అధిపతి సుదిప్త సేన్ మరియు అతని న్యాయ సలహాదారు నరేష్ బలోదియాను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ పార్టీపై, ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మరియు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో లెఫ్ట్ పార్టీలకు కూడా సంబంధం ఉన్నప్పటికీ వారినెవరినీ అరెస్ట్ చేయకుండా తమ పార్టీనేతలని అరెస్ట్ చేస్తూ వేధింపులకి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు కూడా తమ పార్టీపై చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన పార్టీ నేతలను అరెస్ట్ చేసినంత మాత్రాన్న తను భయపడబోనని ఆమె మోడీని హెచ్చరించారు.