విజయవాడలో చంద్రబాబు తనికీలు
posted on Dec 13, 2014 6:38AM
ఈరోజు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కాలువలు మరియు ఇసుక క్వారీలను స్వయంగా తనికీలు నిర్వహించబోతున్నారు. ప్రకాశం బ్యారేజి నిర్వహణ, మరమత్తుల విషయంలో గత అనేక సం.లుగా నిర్లక్ష్యం వహించడం వలన అమూల్యమయిన నీళ్ళు వృధా అవడం లేదా ప్రతీ ఏటా బ్యారేజి నిర్వహణ వ్యయాలు తడిసిమోపెడవుతూ ప్రభుత్వానికి భారంగా తయారవడం జరుగుతోంది. అంత ఖర్చు చేసినా బ్యారేజి నిర్వహణ సక్రమంగా ఉండకపోవడం ఆయన దృష్టికి రావడంతో బ్యారేజి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని నిశ్చయించుకొన్నారు. అదేవిధంగా బ్యారేజి నుండి విడుదలయ్యే నీటిని తీసుకుపోయే మంచినీటి కాలువలలో నగరం నుండి వచ్చే మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్ధాలు కూడా కలుస్తుండటం, కాలువలలో చెత్తాచెదారంతో పూడిక పేరుకుపోవడం వంటి సమస్యలపై కూడా ఆయన దృష్టికి రావడంతో మంచినీటి కాలువలను కూడా ఆయన పరిశీలించాలని భావిస్తున్నారు. ఇక ఇసుక అక్రమ రవాణా వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా ఆన్-లైన్ అమ్మకాలకు శ్రీకారం చుట్టినా ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగిపోవడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఆయన స్వయంగా ఇసుక క్వారీల వద్దకు వెళ్లి పరిస్థితిని తెలుసుకొనేందుకు వెళుతున్నారు. ఆయన వెంట స్థానిక మంత్రులు, యంపీలు, యం.యల్యేలు అధికారులు కూడా వెళతారు.