అధికారులలో పెరుగుతున్నఅసంతృప్తి.. మరో తెలంగాణ ఉద్యమం తప్పదా?
posted on Aug 25, 2021 9:07AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏడేళ్ళలో ఎన్నో అద్భుతాలు చేసింది. ప్రాజెక్టులు కట్టింది. పరిశ్రమలు తీసుకొచ్చింది. పుట్టిన క్షణం నుంచి ఆఖరి మజిలీ వరకు వరకు ప్రజలకు పెన్నిధిగా నిలిచే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో నెంబర్ వన్ స్టేట్’గా తెలంగాణ నిలిచింది.. మంత్రులు ఎవరిని అడిగినా ఇదే కథ వినిపిస్తారు.
ఇంత చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టాలి. మళ్ళీ మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి. ఏ ఎన్నికల్లో అయినా, ఆయన ఏ పూచిక పుల్లను నిలబెట్టినా, ఆయన గడప దాటవలసిన అవసం లేకుండానే గెలిపించి పంపించాలి. కానీ ఒకే ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలుపు కోసం ముఖ్యమంత్రి ఎంతగా ఆగమావుతున్నారో చూస్తున్నాం.అంటే ఆయన పాలన జన రంజకంగా ఉందో, జన కంటకంగా ఉందో ఇంకెవరో చెప్పవలసిన అవసరం లేకుండా ఆయనే చూపిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి పాలన అంత గొప్పగా ఉంది కాబట్టే, ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో, ఏకంగా 86 శాతం మంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెరాసకు ఓటేయం, ఓడిస్తాం అని శపథం చేశారు. నిజంగా తెరాస ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి పట్ల జనంలో ఇంత వ్యతిరేకత ఉందా అంటే, హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో ఆయన పడుతున్న హైరానా ఒక సమాధానం అయితే, ఇండియా టుడే సర్వే మరో జవాబు.
అదలా ఉంటే ప్రభుత్వ లోగుట్లు పక్కగా తెలిసిన ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉన్నతాదికారులు, ఉద్యోగాలను వదులుకుని మరీ తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దండయాత్రకు సిద్దమవుతున్నారు. ఇది గమనిస్తే, ముఖ్యమంత్రి సాగిస్తున్న పాలనకు నాలుగు కోట్ల ప్రజలు కోరుకున్న పాలనకు మధ్య ఉండవలసిన పేగుబంధం తెగిపోయిందని మాత్రం చెప్పవచ్చును. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణవాది ఆకునూరి మురళీ అయితే, కేసీఆర్ పాలనను ఏకంగా పిచ్చిపాలన అంటున్నారు. కేసీఆర్ పాలన వలన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని అవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒక నెలరోజుల క్రితం ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ కుమార్, ఆరేళ్ళ సర్వీస్ వదులుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై దండయాత్ర చేస్తున్నారు.దొరల గడీలు పగల గొడతామని గర్జన చేస్తున్నారు. దళిత అజెండాతో ముందుకు వెళుతున్న ప్రవీణ్ కుమార్, తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకాన్ని దగాకోరు పధకంగా పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ముఖ్యమంత్రి దళితుల పట్ల కపట ప్రేమ చుపుతున్నారని ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ప్రభుత్వాన్ని దుయ్య బడుతున్నారు
ఇప్పడు మరో మాజీ పోలీసు అధికారి జైళ్ళ శాఖ మాజీ డీజీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు వినయ్‌కుమార్ సింగ్, తెరాస ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేందుకు త్వరలో సద్భావన యాత్ర చేస్తానని ప్రకటించారు. జన సేన సంఘ్ పేరిట స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన ఆయన.. మహా పరివర్తన్ ఆందోళన్ పేరుతో ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకనే బ్యూరోక్రాట్లు వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారని అన్నారు.
నిజానికి, పైకి కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవీ కొద్ది పేర్లే అయినా, ప్రభుత్వ యంతంగంలో కింది నుంచిపై వరకు అనేక మందిలో ఇదే అభిప్రాయం ఉంది. ఒక విధమైన నిరాశ, నిర్లిప్తత, ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఆత్మ న్యూనత భావం వ్యక్తమవుతునాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాటను పోషించిన టీఎన్జీఓ నాయకులు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు చాలా వరకు కేసీఆర్ పాలన పట్ల అసంతృప్తితోనే ఉన్నారు. ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలోనే మరో తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు, మేథావులు సిద్దమవుతున్నారా అంటే అవుననే అంటున్నారు.