తాలిబాన్ల దగ్గర భారీగా ఆయుధాలు.. భారత్ కు పెను ముప్పేనా?
posted on Aug 24, 2021 @ 9:20PM
ఆఫ్ఘనిస్థాన్ నుంచి రోజుకో దిమ్మతిరిగే వార్త వినిపిస్తోంది. అక్కడ తాలిబాన్లు ఏ అరాచకం చేసినా, ఏ బ్రేకింగ్ లేదా షాకింగ్ న్యూస్ క్రియేట్ చేసినా... అది నేరుగా భారత్ లోనే భయకంపం రేపుతోంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో దళాలు వెనక్కి వెళ్లిన తరువాత అందరికన్నా ముందుగా సంతోషం వ్యక్తం చేసింది పాకిస్తానే కావడం గమనార్హం. అదీగాక ఐఎస్ఐ మాజీ అధికారి ఒకరు చేసిన ప్రకటన కూడా భారత్ వైపు నుంచి ఆందోళనలకు కారణమవుతోంది. తాజాగా భారీ ఎత్తున ఆయుధాలు డంప్ చేసిన భారీ కంటెయినర్ ముందు కాపలా కాస్తున్న తాలిబాన్ల ఫొటో అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలెలా ఉంటాయన్న వణుకు పుట్టిస్తోంది.
అమెరికాకు చెందిన వందలాది ఆయుధాలకు పహరా కాస్తున్న తాలిబాన్ల ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ కంటెయినర్లో ఎం-16, ఆర్పీజీ, ఇన్సాస్ వంటి శక్తిమంతమైన ఆయుధాలున్నాయి. వాటిని ఎవరూ ఎత్తుకుపోకుండా సాయుధులైన తాలిబాన్లు, గన్ మెన్లు కాపలా కాస్తున్నారు. ఇటీవలే పంజ్ షీర్ లో తాలిబాన్లకు ఎదురుదెబ్బ తగలడంతో వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ల అధీనంలో ఉన్న ఆయుధాలను ఎవరూ ఎత్తుకుపోకుండా, ముఖ్యంగా తాలిబాన్ల అరాచకాలను సాగనివ్వమంటూ బహిరంగ సవాల్ విసురుతున్నవారి చేతికి ఆయుధాలు దక్కకుండా చూసేందుకు భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే నెటిజన్ల కామెంట్లు అన్నీ కూడా ఆ ఆయుధాలు అక్కడ ఎందుకున్నాయి.. అనే విషయం చుట్టూ తిరుగుతుండడం విశేషం. అమెరికా, నాటో దళాలు పోతూపోతూ ఈ మారణాయుధాలను ఎందుకు తీసుకెళ్లలేదు? కావాలనే వ్యూహాత్మకంగా తాలిబాన్లకు వదిలేసి వెళ్లిపోయారా? పాకిస్థాన్ కు పరోక్షంగా సహకరించాలన్న ఉద్దేశంతోనే ఆయుధాలు వదిలేసి పోయారా.. అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. 20 ఏళ్లకు పైగా తాలిబాన్లను ఆఫ్ఘనిస్థాన్ లోకి అడుగు పెట్టకుండా చేసిన అమెరికా... ఒప్పందం కుదుర్చుకొని మరీ వెళ్లాల్సిన అగత్యమేంటి? అసలు ఎప్పుడూ అమెరికా మీద విషం చిమ్మే తాలిబాన్లు అమెరికా సైనికులను ఎవిరినీ ఏమీ అనకపోవడంలో మర్మమేంటి.. అల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ ను తుదముట్టించిన కోపం తాలిబాన్లకు ఉండదంటే నమ్మెదెలా.. మరలాంటప్పుడు అమెరికా వదిలేసిన ఆయుధాలు భవిష్యత్తులో ఎవరిమీదికి ఎక్కుపెడతారు.. లేక నిజంగానే పాకిస్తాన్ ను దారికి తెచ్చుకోవడంలో విఫలం కావడం వల్లే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో చేతులెత్తేసిందా... ఇలా పరిపరి విధాలా అనుమానాలు బలపడుతున్నాయి. ఈ అనుమానాలే నిజమైతే... అమెరికా భారత్ కు మిత్రదేశంగా ఉండి చేసింది శూన్యమే కదా అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.
పలువురు ఇండియన్ పొలిటీషియన్లు తాలిబాన్లను స్వాగతిస్తుండగా... కొందరైతే తాలిబాన్లతో చర్చలు జరపాలంటూ డిమాండ్లు చేస్తుండడం అటు పాకిస్థాన్ కు కలిసొచ్చే అంశంగా మారుతోంది. అంటే ఇకపై పాకిస్థాన్ సైన్యం, అది ఎగదోస్తున్న టెర్రరిస్టులు.. ఇకపై పాక్ భూభాగం నుంచి కాకుండా ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అటు అమెరికా తాలిబాన్లకు సాయం నిలిపివేయవచ్చు కానీ... పాకిస్తాన్ కు చేయి అందిస్తూనే ఉంది. ఇప్పటికీ పాక్ ను వ్యూహాత్మక మిత్రదేశంగానే చెబుతోంది. ఓ మాజీ ఐఎస్ఐ అధికారి మీడియా డిబేట్ లో మాట్లాడుతూ వెల్లడించిన అంశాలు పాక్-అమెరికా మైత్రిని కన్ఫామ్ చేస్తున్నాయి. ఉగ్రవాదుల్ని తుదముట్టించేందుకు అమెరికా బిలియన్ల డాలర్లు విడుదల చేసిందని, కానీ తాము మాత్రం ఆ డబ్బును అందుకోసం ఉపయోగించలేదని అసలు గుట్టు విప్పడం దీంతో పాక్ ఇకపై ఆఫ్ఘన్ భూభూగాన్ని భారత్ పై యుద్ధానికి ఉపయోగించుకోవడం ఖాయమన్న అభిప్రాయాలకు తావిస్తోంది.
ఆఫ్ఘనిస్థాన్ లో పరిణామాలపై అందరికన్ ఎక్కువగా భారతీయులే రియాక్టవుతున్నారు. భారత్ కు ఇప్పుడు శత్రుదేశాల సంఖ్య పెరిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘన్లో పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించడమే కాక పాక్ పోకడలకు తగినట్టు, అంతర్జాతీయ సమాజం మెప్పు పొందేలా భారత్ వైఖరి ఉండాలంటున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో భారత్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయాందోళనలు వినిపిస్తున్నాయి