జైలా? బెయిలా? జగన్-రఘురామ కేసులో ఇవాళే తీర్పు..
posted on Aug 25, 2021 @ 9:36AM
ఉత్కంఠ. నరాలు తెగే ఉత్కంఠ. మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ. ఏం జరగబోతోంది? ఇవాళ్టి సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? రఘురామ కోరినట్టు బెయిల్ రద్దు అవుతుందా? సీబీఐ.. కోర్టు విచక్షణకే నిర్ణయాన్ని వదిలేయడంతో.. జైలు తప్పదా? ఇన్నాళ్లూ నిర్మించుకున్న అధికార సౌధం నేటితో కుప్పకూలిపోతుందా? బెయిల్‌పై స్వేచ్ఛగా విహరిస్తున్న తాను ఇక రెక్కలు విరిగి నేల కూలిపోతానా? ఇలా సీఎం జగన్‌లో ఉండబట్టలేని ఉత్కంఠ. కేసు అలాంటిది మరి. పిటిషన్ అలాంటివాడు మరి. ఎంపీ రఘురామ పక్కా ఆధారాలతో, వాదనలతో సీబీఐ కోర్టులో గట్టిగా వాదించడం.. సీబీఐ సైతం జగన్‌కు సహకరించకుండా బెయిల్ రద్దు వద్దు అనకుండా తటస్థంగా ఉండటం.. జగన్‌లో భయానికి కారణం. వాదనలు జరిగిన తీరు చూస్తుంటే.. బెయిల్ రద్దు తప్పేలా లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతల్లో కలవరానికి కారణం అవుతోంది. నిన్న రాత్రి.. జగన్‌కు నిద్రలేని రాత్రిగా మారిందట. ఉదయం నుంచీ సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఆందోళనతో ముచ్చెమటలు పడుతున్నాయట. తాడేపల్లి ప్యాలెస్‌లో ఇప్పుడంతా పిన్‌డ్రాప్ సైలెన్స్..అట.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ (బుధవారం) తీర్పు వెలువరించనుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది.
ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తెలపకుండా కోర్టు విచక్షణకే వదిలేయడం మరింత ఆసక్తికరంగా మారింది. వాదనలు ముగియడంతో.. తుదితీర్పుకు వేళైంది. సీఎం జగన్‌లో గుండెదడ పెరిగిపోయింది.