సెప్టెంబర్ 16న తెలంగాణ కేబినెట్ భేటీ
posted on Sep 14, 2021 @ 2:17PM
తెలంగాణ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 16న జరగబోతోంది. ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం ఉంటుందని సీఎస్ సోమేష్ కుమార్ అధికారంగా ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధుపైనా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దళిత బంధును ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. హుజురాబాద్ కు చెందిన దాదాపు 14 వేల కుటుంబాల ఖాతాలకు నిధులు కూడా జమ అయ్యాయి. తాజాగా హుజురాబాద్ తో పాటు ఖమ్మం జిల్లా మధిర, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి, కామా రెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లోను దళిత బంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సోమవారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో వివిధ పక్షాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తారని అంటున్నారు. దళిత బంధు లాగా అన్ని వర్గాల్లోని పేదలకు బంధు పథకం అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. దీనిపైనా కేబినెట్ లో చర్చించవచ్చని భావిస్తున్నారు.
వినాయక నిమజ్జనోత్సవానికి హైకోర్టు తీర్పుతో ఇబ్బందులు తలెత్తాయి. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని ఆదేశించింది హైకోర్టు. ఈ తీర్పుపై జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే కోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేక తీర్పు వస్తే ఏం చేయాలన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, విద్యాసంస్థలు తెరిచినందున ఇప్పటివరకు తలెత్తిన సమస్యలపైనా చర్చ ఉండే అవకాశం ఉంది. వరి కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు పెట్టిందని ఆరోపిస్తున్న కేసీఆర్.. దీనిపైనా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.యాసంగిలో వరి సాగు, పంట కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికపైనా మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చర్చిస్తారని అంటున్నారు. హుజురాబాద్ కు సంబంధించి నిర్వహించిన వివిధ సర్వేల ఫలితాలను మంత్రులతో ముఖ్యమంత్రి పంచుకునే అవకాశం ఉందంటున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తి కావస్తున్నందున.. ఆలయ ప్రారంభోత్సవంపైనా మంత్రివర్గంలో చర్చించవచ్చని భావిస్తున్నారు.