ఏపీ అదనపు అప్పులకు కేంద్రం అనుమతి.. దొందూ దొందేనా..?
posted on Sep 14, 2021 @ 3:28PM
నేను బెదిరించినట్టు చేస్తా. నువ్వు భయపడినట్టు చేయి. అప్పుడే మనిద్దరం కలిసిమెలిసి ఉన్నామనే విషయం.. చూసే వాళ్లకు అనుమానం రాకుండా ఉంటుంది. అలా ఉంది కేంద్రం-ఏపీ ప్రభుత్వ వ్యవహారం అంటున్నారు విమర్శకులు. ఏపీ అప్పుల కుప్పగా మారడంపై కేంద్రం కన్నెర్ర చేసిందంటూ వార్తలు వస్తాయి. స్థాయికి మించిన అప్పుల లెక్కలు లాగడానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఏజీని నియమిస్తుంది. మద్యం ఆదాయంపై అప్పులు చేయడాన్ని నిలదీస్తుంది. ఏపీ అప్పులపై పదే పదే తప్పుబడుతుంది. అది సరి కాదంటూ.. అప్పుల తప్పులు సరి చేసుకోవాలంటూ హెచ్చరిక ధోరణిలో సూచనలు చూస్తుంది. అదంతా నిజమే అనుకున్నారు ఇన్నాళ్లూ. ఏపీ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కేంద్రం భలే కంట్రోల్ చేస్తుందే అని భావించారంతా. అయితే, అదంతా ఉత్తుత్తి బెదిరింపులేనని.. కేంద్రం-ఏపీ.. బీజేపీ-వైసీపీ మధ్య పైకి కనిపించని అండర్‌స్టాండింగ్ బాగానే ఉందనే ప్రచారం నిజమేనని పలుమార్లు తేలిపోయింది. తాజాగా, మరోసారి ఆ విషయం స్పష్టమైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించడం ఆసక్తికర పరిణామం. అప్పులతో మరో 2,665 కోట్ల సమీకరణకు ఏపీ సర్కారుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే ఎఫ్ఆర్ఎమ్‌బీ లిమిట్ దాటిపోతోందనే గగ్గోలు ఒకవైపు.. పరిమితికి మించి అప్పులు చేస్తోందనే ఆందోళన మరోవైపు.. ఇవేమీ పట్టించుకోకుండా.. తామ లెక్కలు తామవేనంటూ.. ఏపీ మరో రెండు వేలన్నర కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు ఓకే చెప్పేసింది కేంద్రం. అందుకు, టెక్నికల్‌గా మూలధన వ్యయాన్ని రీజన్‌గా చూపుతోంది కేంద్ర ఆర్థిక శాఖ.
మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు అనుమతి ఇవ్వగా అందులో ఏపీ కూడా ఉండటం ఆసక్తికరం. కేంద్ర తాజా నిర్ణయంతో ఏపీకి 2021- 22 మొదటి క్వాటర్‌లో అదనపు రుణాలు పొందేందుకు అనుమతి వచ్చినట్టైంది. మార్కెట్ నుంచి అదనంగా ఏపీ రూ.15,721 కోట్ల సమీకరణ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నందుకు గాను ఆ మేరకు రాష్ట్రానికి కేంద్రం తరఫున ప్రోత్సాహకం లభించింది. ఏపీతో పాటు మరో 11 రాష్ట్రాలకు ఈ అదనపు రుణ సమీకరణకు అనుమతి ఇచ్చామని కేంద్రం చెబుతుంటే.. అదంతా సరే గానీ.. మరి, ఏపీ అప్పులపై ఇటీవల కేంద్రం ఎందుకు ఆందోళన వ్యక్తం చేసినట్టు? ఏపీ అప్పుల లెక్కలపై ఏజీని ఎందుకు నియమించినట్టు? నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ల ద్వారా నిధులు కొల్లగొట్టడం.. లిక్కర్ ఆదాయాన్ని ష్యూరిటీగా పెట్టి అప్పులు చేయడం.. సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.