కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు! రేవంత్ రెడ్డి కామెంట్లతో రచ్చ..
posted on Sep 14, 2021 @ 2:04PM
అటు బీజీపే, ఇటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీ బండి సంజయ్ కి కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాయి. బండి రాకతో బీజేపీలో, రేవంత్ కాకతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపధ్యంలోనే అధికార తెరాసకు ప్రత్యాన్మాయం ఎవరు? అన్న ప్రశ్న మళ్ళీ తెరపైకొచ్చింది.
రేవంత్ రాకకు ముందు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించంతో కారుకు కమలమే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం బలపడింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత సీన్ మారింది. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు పుచ్చుకున్న తర్వాత టోటల్’గా సీన్ రివర్సే అయింది. హస్తం పార్టీ పైచేయిగా నిలిచింది. రేవత్ రెడ్డి దూకుడుతో పాటుగా కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరుగుతూ వచ్చింది. రేవంత్ చుట్టూనే కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది. అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ అంటే రేవంత్, రేవంత్ అంటే కాంగ్రెస్ అనే విధంగా రేవంత్ రెడ్డి గిరిజన, దళిత, దండోరా తో దూసుకు పోతున్నారు.
నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోటీనే కాదు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేక మంది కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం వుంది. ఎన్నో ఎన్నికలు, అటుపోట్లు ఎదుర్కున్న రాజకీయ అనుభవమూ పుష్కలంగా వుంది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి (1983) ముందు ఆంధ్ర ప్రదేశ్’లో ఏక (కాంగ్రెస్) పార్టీ ప్రజాస్వామ్యమే నడిచింది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, అధికారంలో కొనసాగింది.రాష్ట్రాన్ని పాలించింది. తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత కూడా కాంగ్రెస్, టీడీపీలే వంతుల వారీగా రాష్ట్రాన్ని పాలించాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ బీజేపీ ఎప్పుడూ అధికారం సంగతి దేవుడెరుగు, పట్టుమని పది స్థానాలలో గెలిచిందే లేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఒక సారి ఐదు, రెండవ సారి ఒకటి (ప్లస్ దుబ్బాక) మాత్రమే గెలిచింది.
ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, రాష్ట్ర విభజన తర్వాత కూడా, కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో రెండు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 20కి పగానే స్థానాలలో గెలిపించి తెరాసకు ప్రత్యాన్మాయం కాంగ్రెస్ పార్టీనే, అని తిరుగులేని తీర్పు నిచ్చారు. ప్రధాన పతిపక్ష హోదా నిచ్చారు. అయితే, హస్తం గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు క్యూ కట్టి తెరాస గూటికి చేరడంతో, కాంగ్రెస్ పార్టీ ఆ హోదాను నిలబెట్టుకోలేక పోయింది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అయినా, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాలు గెలుచుకుంది. అయితే, కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఉన్నా, నాయకులలో నిబద్ధత మాత్రం లేకుండా పోయింది. పార్టీలోని అంతర్గత విబేధాలు, పార్టీ ముందడుగుకు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయి.
ముఖ్యంగా జాతీయ స్తాయిలో ఏ విధంగా అయితే, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటి సేనియర్లు జీ 23 గా ఏర్పడి అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీకి మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారో, అదే విధంగా రాష్ట్రంలోనూ సీనియర్లు, రేవత్ దూకుడుకు కళ్ళెం వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ బలహీనతను, కేసీఆర్ తమకు అనుకూలం మార్చుకుంటున్నారు. ఇంత కాలం ఇది రహస్య వ్యవహారంగా సాగుతున్నా, కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు ముఖ్యమంత్రికి మంచి మిత్రులుగా మెలుగుతున్నారు అనేది బహిరంగ రహస్యమే. ఈనేపధ్యంలోనే రేవంత్ రెడ్డి, అసలు గుట్టును బయట పెట్టారు. ముఖ్యమంత్రి కుట్రలు చేసి... కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చీలికలు తెచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు.
నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. పార్టీ నాయకులూ, కార్యకర్తలలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తెరాసకు ప్రత్యాన్మాయంగా నిలిచే అవకాశం హస్తం పార్టీకే వుందనే అబిప్రాయం బలపడుతోంది. అయితే ఇంతలోనే తెరపైకొచ్చిన అంతర్గత కుమ్ములాటలు పార్టీకి ప్రతిబంధకంగా మరే ప్రమాదం ఉందని అంటున్నారు. అవును రాజకీయాలలో ఆత్మహత్యలే కాని, హత్యలు ఉండవు, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకుంటే, అది హస్తం పార్టీ స్వయం కృతమే అవుతుంది.