రాజకీయ వ్యవస్థల చేతిలో రాజ్యాంగ ప్రక్రియ ఓటమి
posted on Dec 19, 2013 @ 9:06PM
రాష్ట్ర ఉభయ సభలు టీ-బిల్లుపై ఎటువంటి చర్చ జరుపకుండానే రెండు వారాల పాటు నిరవదిక వాయిదా పడ్డాయి. అందుకు భాధ్యులయిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంతమాత్రం చింతించకుండా, చింతిస్తున్నట్లుగా అద్భుతంగా నటిస్తూ ఎదుటవారి మీద బురద జల్లుడు కార్యక్రమం మొదలుపెట్టేసారు. సభలో బిల్లును ప్రవేశపెట్టేము గనుక తాము విజయం సాధించామని తెలంగాణావాదులు భుజాలు చరుచుకొంటుంటే, బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోగలిగామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా భుజాలు చరుచుకొంటున్నారు. ఇదంతా చూస్తుంటే మన రాజకీయాల ముందు మన రాజ్యాంగ ప్రక్రియ పూర్తిగా ఓడిపోయినట్లు స్పష్టం అవుతోంది.
టీ-బిల్లు రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కోరుకొంటున్న వారి కళ్ళు తెరుచుకోనేలా దానిపై ధాటిగా తమ వాదనలు వినిపించి ఓడిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బిల్లుపై తన వాదన వినిపించకుండా సభ్యులకు క్రమశిక్షణ పాటాలు చెప్పారు. ఇక సమైక్య తీర్మానం చేసేవరకు ఉభయ సభలలో బిల్లుపై ఎటువంటి చర్చ జరుగకుండా అడ్డుకొంటామని వైకాపా నిర్లజ్జగా చెప్పడం చాలా శోచనీయం.
ఉభయ సభలలో ప్రజాభిప్రాయం ప్రతిబింబించే విధంగా ప్రజాప్రతినిధులు తమ వాదనలు వినిపించే బదులు, కేవలం తమ పార్టీ వ్యూహాలకే ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతూ విలువయిన సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేయడం గమనిస్తే తమను చట్ట సభలకు పంపిన ప్రజలపట్ల వారికి ఎంత నిర్లక్ష్యమో అర్ధమవుతోంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ప్రమాణాలు చేసిన సదరు ప్రజాప్రతినిధులు, ఆ రాజ్యంగ వ్యవస్థ పట్ల కూడా అదే నిర్లక్ష, ధిక్కార ధోరణి ప్రదర్శించడం చాలా శోచనీయం.
రాష్ట్ర విభజన జరగాలని, వద్దని కోరుకొనేవారు చట్ట సభలలో ఆ విషయాన్ని తమ వాదనల ద్వారా వినిపించి, తమకు అన్యాయం జరిగిందని భావిస్తే అప్పుడు రాష్ట్రపతి లేదా సుప్రీం కోర్టు జోక్యం కోరగలిగేవారు. కానీ, తమకు ఇచ్చిన అవకాశాన్ని చేజేతులా ఉద్దేశ్యపూర్వకంగానే దుర్వినియోగపరచుకొని, ఆ తరువాత రాష్ట్రపతిని, సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, అది కేవలం ప్రజలను ఇంకా మభ్యపెట్టేందుకు మాత్రమే ఆడుతున్నమరో నాటకమవుతుంది.
ఇటువంటి చావు తెలివితేటలు ప్రదర్శించినందుకే డిల్లీలో ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను చీపురు కట్టతో ఊడ్చిపడేసారు. అటువంటి రాజకీయ చైతన్యం తెలుగు ప్రజలకు లేదని, అందువల్ల అటువంటి ప్రమాదం ఎన్నడూ తమకు ఎదురవదని మన రాజకీయ పార్టీలు గుడ్డిగా విశ్వసిస్తే అది వారి దౌర్భాగ్యం. ఈ అరాచక వ్యవస్థతో విసిగేత్తిపోయున్న ప్రజలలో నుండి మరో ఆమాద్మీ ఉద్భవించవచ్చు. విలువలు, ప్రజలపట్ల గౌరవం లేని మన రాజకీయ నేతలను వారి పార్టీలను చీపురుతో ఊడ్చిబయట పడేయవచ్చును. అందువల్ల ప్రజాప్రతినిధులు ఇంకా ప్రజల సహనాన్ని పరీక్షించకుండా ప్రజలు తమకు అప్పజెప్పిన భాద్యలను సక్రమంగా నిర్వర్తించడం వారికే మంచిది.