టీ-బిల్లుపై చర్చకు రాజకీయ పార్టీలు వెనుకంజ దేనికో
posted on Dec 18, 2013 @ 3:10PM
నిజానికి టీ-బిల్లుపై చర్చజరగాలని ఏపార్టీ కూడా మనస్పూర్తిగా కోరుకోవడం లేదు. టీ-కాంగ్రెస్, తెరాస, బీజేపీలు బిల్లుపై చర్చ జరిగినట్లయితే అనవసర కాలయాపన, పైగా లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని భయపడుతున్నాయి. అందువల్ల అవి చర్చ లేకుండానే బిల్లుని త్రిప్పిపంపేయాలని కోరుకొంటున్నాయి.
ఇక సమైక్యరాగం ఆలపిస్తున్న వైకాపా నిజానికి రాష్ట్ర విభజన జరిగితేనే లాభపడుతుంది. సమైక్య సెంటిమెంటుతో వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని ఆశిస్తున్నవైకాపా, ఇప్పుడు సభలో బిల్లుపై చర్చకు సహకరిస్తే దానివల్ల కాలయాపన జరగడమే కాకుండా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య చాంపియన్ గా ఎదిగే అవకాశం ఉంది. గనుక సభకు టీ-బిల్లు వచ్చిన తరువాత కూడా ఇంకా సమైక్య తీర్మానం చేయాలంటూ ఒక కుంటి సాకు పట్టుకొని సభకు అడ్డుపడుతోంది.
ఇక, రాష్ట్ర విభజనపై నేటికీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించకుండా బండి లాగించేస్తున్నతెదేపా, బిల్లుపై చర్చజరిగి మాట్లాడవలసి వస్తే అది పార్టీకి ఇంకా నష్టం కలిగిస్తుందని భయపడుతూ ఉండి ఉండవచ్చును. ఇప్పటికే ఒకపక్క ఎర్రబెల్లి, మోత్కుపల్లి తెలంగాణా కు అనుకూలంగా, మరో పక్క గాలి ముద్దు కృష్ణం నాయుడు, పయ్యావుల కేశవ్ అందుకు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారు. బిల్లుని వెంటనే చర్చకు పెట్టాలని వాదిస్తూ ఒకరు, దానిని చింపి ముక్కలు చేస్తూ మరొకొకరు ఒకేచోట మీడియాకు ముందుకు వస్తుండటంతో తెదేపా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. బిల్లు శాసనసభ గడప దాటే వరకు దానికి ఈ ఇబ్బంది తప్పదు. గనుక, బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుపడుతోందని భావించవచ్చును.
ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల దిగ్విజయ్ సింగ్ తో సమావేశమయినప్పటి నుండి తన సమైక్యజోరు తగ్గించడం స్పష్టంగా కనబడుతూనే ఉంది. బిల్లు సభలో ప్రవేశపెట్టి రెండు రోజులయినా కూడా ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా నోరు విప్పి మాట్లాడకపోవడం గమనిస్తే, అయన కూడా బిల్లుని వీలయినంత త్వరగా వెనక్కి త్రిప్పి పంపెయాలనే ఆలోచనతోనే ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఆయనే వెనక్కి తగ్గిన తరువాత ఆయన అనుచరులు మాత్రం ముందుకు దూకుతారని ఆశించడం అవివేకమే.
అందువల్ల ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ కూడా బిల్లుపై సభలో చర్చ జరగాలని కోరుకోవడం లేదని స్పష్టం అవుతోంది. కానీ దైర్యంగా ఆమాటను పైకి అనలేవు గనుక అన్నిపార్టీలు కూడా తాము ప్రజల ముందు దోషులుగా నిలబడకుండా తప్పించుకొనే ప్రయత్నంలో ఏదో ఒక సాకుతో సభలో రభస చేస్తూ బిల్లుపై తమ అభిప్రాయాలు చెప్పకుండా మొహం చాటేస్తున్నాయి. ఇంకా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర విభజననే కోరుకొంటున్నాయనేది చేదు నిజం.
బహుశః బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే రాష్ట్రపతికి త్రిప్పి పంపబడవచ్చనే తెలుగువన్ అంచనాలు నిజమయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. కానీ పార్లమెంటులో బిల్లు ఆమోదానికి బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం లేనందున, ఒకవేళ బిల్లు త్వరలోనే రాష్ట్రపతికి చేరుకొంటే, కాంగ్రెస్ అధిష్టానం ఏవిధంగా గండం గట్టెక్కుతుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బహుశః దానిని రాష్ట్రపతి దగ్గరే త్రొక్కి పెట్టిస్తుందేమో.