రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఆఖరి ఎత్తు ఏమిటి?
posted on Dec 20, 2013 @ 2:22PM
రాష్ట్ర విభజనపై కధ ఇంతవరకు తీసుకువచ్చిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు వెనక్కి తగ్గితే వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా ఘోరంగా ఓడిపోవడం సంగతి ఎలా ఉన్నపటికీ, అక్కడ కూడా పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. కానీ, బీజేపీ మద్దతు లేనిదే తెలంగాణా బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయడం అసాధ్యమనే సంగతి కాంగ్రెస్ మొట్టమొదటి రోజే గ్రహించింది గనుకనే, రాష్ట్ర విభజన చేస్తున్నట్లు అందరికంటే ముందుగా తన రాజకీయ ప్రత్యర్ధి అయిన బీజేపీకే తెలియజేసి మద్దతు కోరింది. బీజేపీ కూడా మొదట అందుకు సంతోషంగా అంగీకరించినప్పటికీ, దానివల్ల తెలంగాణాలోనే కాకుండా రెండు ప్రాంతాలలో తీవ్రంగా కూడా నష్టపోతామని గ్రహించగానే క్రమంగా సమన్యాయం రాగమాలపించడం ఆరంభించింది.
అయితే కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్ధి అయిన బీజేపీ అండతోనే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదింపజేయవచ్చని గుడ్డిగా నమ్మేంత తెలివి తక్కువధి కాదు. ఒకవేళ బీజేపీ ఆఖరు నిమిషంలో తనకే హ్యాండిస్తే ఏమిచేయాలనే ఆలోచన లేకుండా కాంగ్రెస్ కధని ఇంతవరకు తీసుకు వచ్చిందని భావించలేము. బీజేపీ మద్దతిస్తే తెలంగాణా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవచ్చును. లేకుంటే తెలంగాణా ఏర్పాటుకు సహకరించలేదనే నింద బీజేపీపై వేసి తను ఈ సమస్య నుండి క్షేమంగా బయటపడవచ్చును.
కానీ, బీజేపీని నమ్ముకొని తను పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోతే, ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది గనుక, ఎన్నికల షెడ్యుల్ విడుదల సమయం దగ్గిర పడేవరకు కూడా ఏదో విధంగా తాత్సారం చేసి, అప్పుడు తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే, దానిని ఆమోదింపజేసుకోలేక అప్పుడు ప్రభుత్వం కూలిపోయినా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టం ఉండదు. పైగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం తన స్వంత ప్రభుత్వాన్నేపణంగా పెట్టుకొన్న త్యాగమూర్తులమని కాంగ్రెస్ టాంటాం చేసుకొంటూ దైర్యంగా ఎన్నికలకు వెళ్ళవచ్చును. ఈవిధంగా తెలంగాణాలో తన పార్టీని కూడా కాపాడుకొంటూనే, తాము తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయబోతే బీజేపీ అడ్డుకొందని, అటువంటి పార్టీతో చేతులు కలిపిన లేక కలపాలనుకొంటున్న తెరాసకు ఓట్లు వేయకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ తెలంగాణా ప్రజలను దైర్యంగా ఓట్లు కోరవచ్చును.
ఈవిధంగా చేసి తెరాస తమతో కలిసినా కలవకున్నా కాంగ్రెస్ పార్టీ కొంతలో కొంత నష్టం తగ్గించుకోవచ్చును. అయితే వీటన్నిటికి మించిన గొప్ప ఉపశమనం ఏమిటంటే, తనకు చేతకాని ఈ రాష్ట్ర విభజన భారాన్నికాంగ్రెస్ అధిష్టానం తన నెత్తి మీద నుండి క్రిందకు దింపుకోవచ్చును. ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత మళ్ళీ అధికారంలోకి వస్తే, అప్పటి పరిస్థితులను బట్టి తెలంగాణా ఏర్పాటు చేయడమో లేకపోతే మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టి తాపీగా ఐదేళ్ళు లాగించేయడమో చేయవచ్చును. ఒకవేళ ఓడిపోతే, ఈ ముళ్ళ కిరీటాన్నితనను గద్దె దింపిన మోడీ నెత్తిన పెట్టేసి చేతులు దులుపుకోవచ్చును కూడా.
బహుశః ఈ ఆలోచనతోనే నిన్న హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే తెలంగాణా బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెడతామని ప్రకటించారానుకోవలసి ఉంటుంది. లేకుంటే బిల్లు డిల్లీ చేరుకోగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లుని ఆమోదింపజేస్తామని చెప్పి ఉండేవారు.