తెలంగాణావాదాన్ని అమ్మేసిన కేసీఆర్
posted on Mar 26, 2011 @ 3:36PM
హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణావాదాన్ని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు విక్రయించారని హైదరాబాద్ నగర తెదేపా అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణావాదాన్ని కేసీఆర్ ఢిల్లీలోనూ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనూ అమ్మేశారన్నారు. కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడడం ద్వారా తెరాస బండారం బయటపడిందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వందలాది మంది విద్యార్థుల ఆత్మలు దీంతో క్షోభిస్తాయని ఆయన అన్నారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా ఆరోపించిన కేసీఆర్.. ఇపుడు ఆ పార్టీ చెంతనే ఎలా చేరుతారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లేముందు మిలియన్ మార్చ్ గురించి భీషణ ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ ఢిల్లీకి నుంచి తిరిగివచ్చాక ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ప్రయత్నించడం నిజంకాదా? అని ప్రశ్నించారు. అందుకుదారితీసిన కారణాలను, రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.