బాబు తెలంగాణకు అనుకూలమే
posted on Mar 26, 2011 @ 3:49PM
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు కట్టుబడి ఉన్నారని తె లుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. పార్టీ, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేక పదవులు పొందారని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలు చేసి తెలంగాణ జెఎసి కింద పోటీ చేయాలని తాను ప్రతిపాదిస్తూ వస్తున్నానని, దీనికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు అంగీకరించాయని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాత్రమే అంగీకరించడం లేదని ఆయన అన్నారు. పార్టీల తరఫున పోటీ చేస్తే స్వార్థం పెరుగుతుందని, పార్టీరహితంగా పోటీ చేయడం వల్ల ఆ స్వార్థం ఉండదని ఆయన అన్నారు. అప్పుడే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.