ఈటలకు అన్యాయం.. కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న క్లారిటీ
posted on Mar 24, 2021 @ 8:19PM
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.. ఈ పేరు తెలంగాణలో ఇప్పుడు ఓ వైబ్రేషన్.. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో విజయ తీరం వరకు వెళ్లారు తీన్మార్ మల్లన్న. సామ్యానుడిగా పోటీ చేసి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో మల్లన్నకు సాధించిన ఓట్లతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. యుద్ధం ఇంకా మిగిలే ఉందని చెప్పారు. కేసీఆర్ ను గద్దే దించే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. సామాన్యుడు సీఎం సీటులో కూర్చూనే వరకు విశ్రమించబోనని చెప్పారు. మల్లన్న ప్రకటనతో ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారా అన్న చర్చ తెరపైకి వచ్చింది. పార్టీ ఏర్పాటుపై ఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్సీ ఫలితాల మరుసటి రోజే మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్లు చేశారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా మనసు మార్చుకోలేదని.. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ మరింత మంట రాజేశారు రాజేందర్. దీంతో బీసీ నినాదంతో తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందా? మంత్రి ఈటల, తీన్మార్ మల్లన్న ఒకే జెండా కిందకు రాబోతున్నారా? కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరాడబోతున్నారా అన్న ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే మల్లన్నకు సంబంధించి మరో చర్చ కూడా చక్కర్లు కొడుతోంది. మల్లన్న బీజేపీలో చేరి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మల్లన్నకు సపోర్ట్ చేసిందనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అండదండలు మల్లన్నకు ఉన్నాయన్న వాదన కొందరు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు తీన్మార్ మల్లన్న. తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు. తన భవిష్యత్ గమనం గురించి క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఈటల రాజేందర్‌పై మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరుగుతోన్న మాట వాస్తవమన్నారు. ఈటలకు జరుగుతోన్న అన్యాయాన్ని గతంలోనే ఖండించానని మల్లన్న గుర్తుచేశారు. ఈటలను రాజకీయంగా కలవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. బీజేపీ నేత బండి సంజయ్ తనకు లక్ష ఓట్లు వేయిస్తే .. మరి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఆయన ఓట్లు వేయించలేకపోయాడని ప్రశ్నించారు. బండి సంజయ్, తాను ఒకే కులమైతే ఏంటని, తమ సిద్ధాంతాలు వేరని తెలిపారు. తాను కులానికి చెందిన వ్యక్తిని కాదని దయచేసి తనపై కుల ముద్ర వేయొద్దని సూచించారు తీన్మార్ మల్లన్న.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల డబ్బులు తనకెందుకని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. తనకు ప్రజలే ఓట్లు, నోట్లు ఇచ్చారని చెప్పారు. తన అనుచరులు ఒక్క రోజు టీ తాగకుంటే.. 5కోట్లు జమ అవుతాయన్నారు. బీజేపీ సహా ఏ పార్టీలోను చేరే ప్రసస్తే లేదని మల్లన్న తేల్చి చెప్పారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని సాగర్ ఓటర్లకు పిలుపుచ్చారు. 45 కేజీల సీఎం కేసీఆర్ శరీరంతో తనకు ద్వేషం లేదన్నారు. కేసీఆర్ మెదడు తీసుకునే నిర్ణయాలనే నేను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా 6వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నానని చెప్పారు. ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రచారం ఒట్టిదేనన్నారు. అసెంబ్లీ అంటే తెలియని వారిని తనతో పాటు అసెంబ్లీ గడప తొక్కిస్తానని తిన్మార్ మల్లన్న ప్రకటించారు.